Mar 11,2023 20:21

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి

- పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి
ప్రజాశక్తి-పీలేరు : రాష్ట్ర విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయాలని తూర్పు రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పీలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ శాఖలో 30 వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు రాష్ట్రంలో రూ.12,500 నెలవారీ వేతనంపై పనిచేస్తూ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఓ కుటుంబం రోజువారీ తమకందే రూ.400 వేతనంతో బతకడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. సాధారణంగా ఉద్యోగులకు ప్రమోషన్‌తో పాటు జీతం పెరుగుతుందని, కానీ ఇక్కడ రూ.15 వేల జీతం తీసుకునే వాచ్‌మెన్‌ షిఫ్ట్‌ ఆపరేటర్‌గా ప్రమోషన్‌ పొంది రూ.13,500 జీతం తీసుకోవడం గర్హనీయమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాను చేసిన పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి వస్తూనే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులైన కరెంట్‌ బిల్‌ రీడర్లకు పీస్‌ రేట్‌ విధానం రద్దు చేసి, నెల జీతం ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అది ఆచరణలోకి రాలేదని విమర్శించారు. గత 10 నుంచి 20 ఏళ్లుగా కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా పని చేస్తున్న వారు, ఎప్పుడు తమ విధులను క్రమబద్ధీకరిస్తారా అని చకోరపక్షుల్లా ఎదురు చూసే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం కాంట్రాక్ట్‌ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తాను పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికైతే ఈ సమస్యల పరిష్కారం కోసం తప్పక కృషి చేస్తానని, గ్రాడ్యుయేట్లందరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేసి, వేయించి గెలిపించాలని అభ్యర్థించారు. సమావేశంలో సిపిఎం నాయకులు వెంకట్రామయ్య, రవి, సిపిఐ నాయకులు టిఎల్‌ వెంకటేష్‌, నరసింహులు పాల్గొన్నారు.