Jul 13,2021 15:30

హైదరాబాద్‌ : రేవంత్‌ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పలు రాజకీయ పార్టీల నాయకులు ఆయన నాయకత్వాన్ని బలపర్చడం కోసం ఆయన వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే పలువురు బిజెపి ముఖ్య నాయకులు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. తాజాగా నిజామాబాద్‌ మాజీ మేయర్‌, ఎంపి ధర్మపురి అర్వింద్‌ సోదరుడు ధర్మపురి సంజరు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత ఎర్ర శేఖర్‌, భూపాలపల్లి సీనియర్‌ నాయకుడు గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు మంగళవారం హైదరాబాద్‌లో మీడియా ముందు తెలిపారు. సంజరు మాట్లాడుతూ.. రేవంత్‌ టిపిసిసి అధ్యక్షుడు అయినందుకు మనస్ఫూర్తిగా అభినందించానని చెప్పారు. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన నేను నాన్న కోసమే టిఆర్‌ఎస్‌లో చేరానని, రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం కోసం తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తున్నానని ప్రకటించారు. త్వరలో ఢిల్లీ వెళ్లి పెద్దల సమక్షంలో పార్టీలో చేరతానని వెల్లడించారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డిని కలిసిన ఎర్ర శేఖర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా బిజెపి అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరతానని వెల్లడించారు. రేవంత్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ బలోపేతం అవుతుందని గండ్ర సత్యానారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.