హైదరాబాద్ : కాంగ్రెస్‌లో తెలంగాణ జనసమితి (టిజెఎస్) పార్టీని విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో టిజెఎస్ విలీనం ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే, జెఎసిగా ఏర్పడి ప్రజా సమస్యలపై పోరాడుదామని గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేసింది మాత్రం వాస్తవమని వెల్లడించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. టిపిసిసి అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి టిఆర్‌ఎస్ వ్యతిరేక పార్టీగా ముద్రపడిన టిజెఎస్‌ను విలీనం చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని, అందుకు కోదండరామ్ కూడా సానుకూలంగానే ఉన్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.










