కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొస్తాం..
ప్రజాశక్తి - ఆత్మకూరు అర్భన్ : ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, దేశ ప్రజలను తాకట్టు పెట్టి కోట్లు సంపాదిస్తున్న ఘనత బిజెపిదని ఎద్దేవా చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తెచ్చే వరకు విశ్రమించకుండా శ్రమిస్తామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దేవకుమార్‌రెడ్డి, ఆత్మకూరు ఇన్‌ఛార్జి చేవూరు శ్రీధర్ రెడ్డిలు అన్నారు. మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వల్లే దేశం అభివృద్ధి చెందిందని ప్రస్తుతం ఉంటున్న బిజెపి ప్రభుత్వం దేశాన్ని భ్రష్టుపట్టిస్తూ దేశ చరిత్రను వివిధ రకాల స్కామ్‌ల వైపు తీసుకెళ్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాన్ని లేకుండా పరిపాలన చేయాలని ఆకాంక్షతో రాహుల్ గాంధీపై అబద్ధపు కేసులను పెట్టీ ఉద్దేశపూర్వకంగా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడంతోనే మోడీ తన పతనానికి తానే సర్వం సిద్ధం చేసుకున్నారని తెలిపారు. మోడీ దేశ ప్రజల పరువును దేశ ఆర్థిక వ్యవస్థను తన బినామీలైన ఆదానీ, అంబాని వంటి వ్యక్తుల చేతిలో పెట్టి దేశాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. దేశ భవిష్యత్తు కోసం తమ ఇంటి బిడ్డలను భర్తలను ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ కుటుంబాన్ని రూపుమాపేందుకు నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నారని దేశ ప్రజలు వీటిని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పూర్వ వైభవం సంతరించుకుంటుందని తెలియజేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నేతలకు ప్రజలు అన్నదండగా నిలవాలని కోరారు. మొదట పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంఎల్‌ఎ, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.










