యు.పి ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తమకు కావలసిన వాటిని చల్లగా చేసుకుపోతున్నారు బిజెపి నేతలు. అందులో భాగంగానే విశ్వనాథ ఆలయ ప్రాంగణాన్ని గంగానది ఘాట్లతో కలిపేశారు. గతంలో కూడా గంగ శుద్ధి, అభివృద్ధి గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో కబుర్లు చెప్పారు. కోతలు కోటలు దాడినా చేతలు గడప దాటలేదన్న చందంగా తయారైంది పరిస్థితి. గంగను శుద్ధి చేయడానికి ఏకంగా ఓ మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసినా ఒరిగిందేమీ లేదు. నమ్మకాలను తన రాజకీయానికి వాడుకుంటూనే అదే గంగా నదిని కార్పొరేట్ల కాలుష్య కాటుకు బలిచేయడానికి పూనుకుంటోంది బిజెపి ప్రభుత్వం.
స్వచ్ఛ భారత్‌లో ప్రధాని నియోజకవర్గమైన వారణాసికి లభించిన ప్రాధాన్యత అంతంత మాత్రమే. 2017, మార్చి వరకు రెండేళ్ళలో గంగాశుద్ధికి రూ.7,305 కోట్లు ఖర్చు పెట్టారు. ఐనా గంగ గంభీర పర్యావరణ సమస్య లేశమైనా తగ్గలేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కార్పొరేట్లు గంగాశుద్ధికి పైసా ఖర్చు పెట్టలేదు. మోడీ నిశ్శబ్ద నిఘా పాటించారు. 2014లో స్వచ్ఛ భారత్ ప్రారంభించినప్పటి నుండి మూడేళ్ళలో భారత ప్రభుత్వం కేవలం ప్రకటనలకే రూ.530 కోట్లు ఖర్చు పెట్టింది. మొదటి రెండేళ్ళలో 0.5 శాతం చొప్పున రూ.16,400 కోట్ల స్వచ్ఛ భారత్ సెస్సు వసూలైంది. ఇందులో రూ.4,100 కోట్లు స్వచ్ఛ భారత్ నిధికి చేరనేలేదు. 2018 మార్చి దాకా స్వచ్ఛ భారత్ కోసం రూ.33,823 కోట్లు ఖర్చయింది. అపరిమిత ఖర్చు, పరిమిత ఫలితమని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎత్తిచూపారు. ఐనా గంగశుద్ధి జరగలేదు.
కాలుష్య గంగ
యాత్రికులు కాశీ పోషకులే కాదు. కాలుష్యకర్తలు కూడా. సంఫ్‌ు పాలనలో మత మురికి పెరిగింది. హిందువుల పవిత్రగంగ భయంకర కాలుష్య కాసారమైంది. గంగలో పడేయని పదార్థం లేదు. వ్యర్థాలన్నిటికీ అంతిమ స్థానం గంగా నదే. స్థానికుల, యాత్రికుల మలవిసర్జన స్థలాలు గంగ గట్లే. అపరిశుద్ధమైనా, సర్వరోగ సాగరమైనా గంగ పవిత్రమే! దేశ విదేశ భక్తులు ఈ పవిత్రజలాల్లో పుణ్యస్నానాలు చేస్తారు. గంగాజలాన్ని సేవిస్తారు. భద్రపరుచుకొని తీసుకెళతారు. ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్య దేశంలో విదేశీయుల అతి విచిత్ర పర్యాటక క్షేత్రం వారాణసి. కాశీ లోనే గాక గంగా పరీవాహక గ్రామాల్లోకూడా స్త్రీల, బాలికల, పిల్లల శవాలు వందల్లో కనిపిస్తాయి. వాటిని కుక్కలు,పక్షులు పీక్కు తింటూ ఉంటాయి. అంత్యక్రియల ఖర్చు భరించలేని నిరుపేదలు బంధువుల శవాల ను గంగా సమాధి చేస్తారు. గంగలో అంతిమ యాత్ర పుణ్యలోక ప్రయాణమని నమ్మేవారి శవాలూ, అవివాహిత ఆడపిల్లల శవాలూ, అనాథ వృద్ధ మృత దేహాలూ గంగలో కలుస్తాయి.
శవాలు కాలుతుండగానే చితిని ఆర్పి సగంకాలిన శవాలను గంగలో తోసి సగంకాలినకట్టెలను మరొక శవదహనానికి అమ్ముకునేవారూ ఎక్కువే. హత్యల శవాలూ జలదహనాలుగానే భావించబడతాయి. అధికారులు వాటిని నేరాలుగా ఎంచి పని పెంచుకోరు. గంగా జన్మస్థలం హిమాలయాల నుండి సంగమ స్థావరం బంగాళా ఖాతం వరకూ 2,600 కిలోమీటర్ల గంగాతీర దుస్థితి ఇదే. హిందూ మనోభావాలను రెచ్చగొట్టి వారణాసిలో నెగ్గిన మోడీ, ఆయన ప్రభుత్వం గంగా ప్రక్షాళనా ప్రమాణాలు చేసింది. మోడీ గంగా హారతిచ్చి పార్లమెంటుకెళ్ళారు. రోజూ గంగాహారతి ఏర్పాట్లు చేశారు. విదేశీ ప్రముఖులకు గంగా హారతి ప్రదర్శిస్తారు. గంగశుద్ధి మాత్రం చేయరు. పర్యావరణం పాడవుతూనే ఉంది. కాలుష్యం పెరుగుతూనే ఉంది.
అంతర్జాతీయ అవహేళన
మత వంచన, ఆధ్యాత్మిక కపట నాటకాలతో పెంచి పోషించబడుతున్న మురికిని, రోతను, కాలుష్యాన్ని ప్రపంచ దేశాలు అసహ్యించుకున్నాయి. అవహేళన చేశాయి. వారణాసి మురికి చిత్రాలు ప్రపంచ ప్రచారం పొందాయి. ప్రతి విషయంలోనూ మోడీ తప్ప ఇంకెవరు చేస్తారని గొప్పలు చెప్పుకునే ప్రధాని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ దుర్గంధాన్ని ఎందుకు పట్టించుకోలేదని విదేశీయులు విస్తుపోతున్నారు.
సంస్కృతి, సంప్రదాయం పేరుతో ప్రచండ మూఢత్వాన్ని ప్రచారం చేస్తున్నాం. ఆచరిస్తున్నాం. బతుకు దెరువు కోసం అభివృద్ధి చెందిన దేశాలకు పోయినా అనాచారాలను వదలడంలేదు. కాశీ కాలుష్యం ఆ సంప్రదాయాల్లో భాగమే. 50 ఏళ్ల క్రితమే గుంటూరు జిల్లా ఒక మారుమూల పల్లె జాతరలో జంతు బలి నిషేధించారు. పోతులను, కోళ్ళను గుడి చుట్టూ తిప్పుకొని ఇంటికి తీసుకుపోయి కోసుకోమన్నారు. ఘన నాయకులు ఘన జన సమస్య పరిష్కారం కోసం వారాణసి రోతను వారించలేరా? కాశీ కాలుష్యాన్ని కట్టడి చేయలేరా? భక్తులు, ప్రజలు మత భ్రమలు తొలగించుకొని మనుషులుగా బతికే తీరు నేర్చుకోలేరా?
సంగిరెడ్డి హనుమంత రెడ్డి - (వ్యాసకర్త : ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, సెల్ : 9490 20 4545)










