యమునా నది తీరంలో ఒక జువ్విచెట్టు ఉంది. దానిమీద కాకులు, గోరువంకలు, కొంగలు ఒకటేమిటి అన్నిరకాల పక్షులూ గూడు కట్టుకుని, నివాసం ఉండేవి. జాతి భేదం లేకుండా కలిసిమెలసి జీవించేవి. మాణిక్యం అనే కాకికి చిన్నపిల్లలు ఉన్నాయి. ఒకరోజు అది ఆహారం కోసం బయటకు వెళుతూ తమ గూడును గమనిస్తూ ఉండమని గోరువంకను కోరింది. 'నీ పిల్లలు బయటకు రాకుండా జాగ్రత్తగా చూసే బాధ్యత నాది!' అని గోరువంక కాకికి చెప్పింది. అలానే చాలాసేపు కాపలా కాస్తూనే ఉంది. పిల్లలు బయటకు రాకపోవడంతో ఏం కాదులే అనుకుని, తన గూడులోకి వెళ్ళింది. ఇంతలో ఒక కాకి పిల్ల గెంతుతూ బయటకి వచ్చి, కింద పడిపోయింది. అది అలా పాకుకుంటూ చెట్టు పక్కన ఉన్న గట్టు వెనక్కి వెళ్ళింది. ఇంతలో ఆహారం తీసుకొచ్చిన కాకికి పిల్ల కనపడకపోవడంతో 'కావు కావు' మని ఏడుస్తూ.. 'కాసేపు చూడమంటే చూడలేకపోయావా?' అని గోరువంకను అడిగింది. 'అయ్యో ఇప్పటివరకు చూశాను. పిల్లలు జాగ్రత్తగా లోపలే ఉన్నాయి. బయటకు రావులే అని ఇప్పుడే నా గూడులోకి వెళ్లాను. అయినా బయటకు వచ్చిన పిల్ల ఎంతో దూరం వెళ్ళదులే.. పద వెతుకుదాం!' అంది. అది చూసిన కొంగ.. 'ఆ నల్లముద్దలా ఉన్న పిల్లకోసం ఇంత హడావిడి చెయ్యాలా?' అంది చిరాగ్గా. 'కాకిపిల్ల కాకికి ముద్దు!' అంటూ గోరువంక, కాకిపిల్లను వెతకసాగాయి. కాసేపటికి గట్టు పక్కన కీచు కీచు మంటున్న కాకిపిల్ల కనిపించింది. పిల్లను అక్కున చేర్చుకుని, గూడులోకి చేర్చింది కాకి. 'ఆవేశంలో నిన్ను బాధపెట్టాను నన్ను క్షమించు!' అని గోరువంకను అడిగింది. 'నీ స్థానంలో ఎవరున్నా అలానే చేస్తారు. నీవేమి బాధపడకు!' అంది గోరువంక.
కొంతకాలం తర్వాత కొంగ గుడ్లు పెట్టి పొదిగింది. తన పిల్లలను చూసుకుని మురిసిపోయింది. ఒకరోజు ఆహారం కోసం బయటకు వెళ్లి వచ్చేసరికి రెండు పిల్లలు కనిపించలేదు. చుట్టుపక్కలంతా చూసినా అవి ఎక్కడా లేవు. గాబరాపడుతున్న కొంగను చూసి 'ఏమైంది మిత్రమా?' అని అడిగింది కాకి. తన పిల్లలు రెండూ కనిపించడం లేదని ఏడుస్తూ చెప్పింది కొంగ. 'కంగారుపడకు, పిల్లలు ఎంతోదూరం వెళ్ళలేవు వెతుకుదాం!' అంటూ తన తోటి నేస్తాలనూ పిలిచి, కొంగ పిల్లలను వెతకమని కోరింది. అన్నీ కలిసి కొంగ పిల్లలను వెతకసాగాయి. గూడులో నుండి బయటకు వచ్చిన కొంగ పిల్లలు గెంతుకుంటూ చాలాదూరం వెళ్ళాయి. అక్కడొక పాము వాటిని చూసి ఈ రోజుకు ఆహారం దొరికిందని సంతోషంగా వాటివైపు వస్తూ ఉంది. అప్పుడే అది గమనించిన కాకులన్నీ పాము మీద విరుచుకుపడ్డాయి. హఠాత్తుగా వచ్చిన కాకులను చూసి, పాము పారిపోయింది. పిల్లలను కొంగకు అప్పగించాయి కాకులు. 'ఒకరోజు నువ్వు పిల్లల కోసం భయంతో వెతుకుతుంటే గేలి చేశాను. నన్ను క్షమించు. ప్రతి తల్లికీ తన పిల్లలంటే ముద్దు అనే విషయం ఆలస్యంగా తెలుసుకున్నా. మీరు చేసిన సహాయం ఎప్పటికీ మరువలేను!' అంటూ కాకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపింది కొంగ.
కూచిమంచి నాగేంద్ర
91821 27880