Dec 06,2021 09:58

చంద్రపురి దేశం రాజు పండితులను సన్మానిస్తున్నాడు. అది తెలిసిన ఒక పండితుడు గ్రామం పొలిమేర నుంచి అడ్డదారిలో వెళుతుండగా కొన్ని కాకులు అతన్ని వెంబడించసాగాయి. 'ఛీ.. వెధవ కాకులు, ఎన్నో రకాల పక్షులను సృష్టించిన ఆ దేవుడు వీటిని ఎందుకు పుట్టించాడో? అర్థం కావడం లేదు. రాజు గారి వద్దకు వెళ్లి సన్మానం అందుకోవాలని పొరపాటున ఈ దారిని ఎన్నుకున్నాను' అని కాకులను చీదరించుకున్నాడు.
కాకుల గుంపులో, పండితుడి మాటలు ఒక తెలివైన కాకి విన్నది. తమ జాతి మంచిదని నిరూపించుకోవాలని అనుకుంది. అందుకోసం ఆ పండితుడికి ఏవిధంగా అయినా సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆయన నడిచి నడిచి 'అబ్బ... ఆకలి...ఆకలి!' అని ఒక చెట్టు కింద కూర్చుండిపోయాడు. పాపమని ఆ కాకి ఎగిరిపోయి, ఒక జామపండును తెచ్చి అతని ముందు పడేసింది. 'అయ్యా! ఆకలితో ఉన్నట్టున్నారు.. ఈ జామ పండును తినండి!' అని అంది కాకి. 'చిలుక కొట్టిన పండునైనా తినవచ్చును కానీ, నీవు తెచ్చిన పండును ఎలా తింటాను?' అని ముఖం మాడ్చుకున్నాడు ఆ పండితుడు.
'మరీ చాదస్తం కాకపోతే, ఆకలిని ఎవరైనా ఆపుకుంటారా? చిలుక, కాకి అని చూస్తే మీ కడుపే కాలుతుంది.. మీ కర్మ' అంది కాకి. 'కర్మో.. కాకరకాయో.. నా వెంట పడకు.. పరమ చికాకుగా ఉంది' అంటూ కొద్దిదూరం నడచిన తర్వాత సొమ్మసిల్లి పడిపోయాడు' ఆ పండితుడు. 'కాకికి చాలా బాధ కలిగింది. దగ్గరలోని ఒక సువాసన గల పువ్వును తెచ్చి ఆయన ముక్కు దగ్గర పెట్టింది. కాసేపటికి పండితుడు లేచి కూర్చుని 'దాహం...దాహం' అన్నాడు. 'ఇక్కడే పక్కన ఒక బావి ఉంది. దారి చూపిస్తాను రండి' అని ఎగిరిపోయింది. పండితుడు కాకి వెళ్ళిన వైపు వెళ్ళాడు. అది ఒక దిగుడు బావి. పండితుడు మెల్లగా మెట్లు దిగి, దాహం తీర్చుకుని పైకి వచ్చాడు. దాహం తీరడానికి కాకి సాయం చేసింది. అయినా ఆయన కాకికి ధన్యవాదాలు చెప్పలేదు. కాకి మనసు చివుక్కుమంది. దాహం తీరాక ఆయన ఒక చెట్టును ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు. కాసేపు తర్వాత చెట్టు పక్కన ఉన్న పుట్టలోకి వెళ్లబోతున్న ఒక పాము పడగ విప్పి, ఆయన్ని కాటు వేయబోతూ ఉంటుంది. అంతే కాకి ఎగురుతూ వచ్చి పండితుడి తలను కాళ్లతో తన్ని పక్కకు ఎగిరిపోతుంది.
ఉలిక్కిపడి లేచిన పండితుడు 'ఛీ...ఛీ..వెధవ కాకి' అంటూ ఉండగా పక్కన పాము కనిపించింది. అంతే కాళ్లకు బుద్ధి చెప్పాడు. 'అయ్యా! సృష్టిలో అన్ని పక్షులూ సమానమైనవేనని మీలాంటి వారూ గ్రహించక పోవడం చాలా విచారకరం. మీ ఆకలి తీరడానికి జామపండు ఇస్తే వద్దన్నారు. దాహం తీరడానికి మార్గం చూపాను. పాము కాటు నుండి కాపాడాను. అయినా నన్ను చీదరించుకుంటున్నారు' అని అంది కాకి. 'అవును, ఇప్పుడే నాకు జ్ఞానోదయం అయ్యింది. నీవు చేసిన మేలు మరచి, తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించు' అన్నాడు పండితుడు. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. 'మీరు క్షేమంగా రాజు వద్దకు వెళ్లి రండి' అంది కాకి.
'ఏమీ అనుకోకు బాగా ఆకలిగా ఉంది. రెండు జామపండ్లు తెచ్చి ఇవ్వగలవా?' అని అడిగాడు పండితుడు. సరేనంటూ ఎగిరిపోయింది కాకి. 'మీ ఆకలి తీర్చడం నా మహాభాగ్యం' అంటూ జామపండ్లు తెచ్చిచ్చింది. 'నా ఆకలి తీర్చినందుకు నీకు మరోసారి ధన్యవాదాలు!' అంటూ చేతులు జోడించి, నమస్కరించాడు ఆయన. 'మీలాంటి పండితుడికి సహాయం చేయడం నా అదృష్టం!' అంటూ కాకి సంతోషంగా అక్కడ నుంచి ఎగిరిపోయింది.
 

యు. విజయశేఖర రెడ్డి
9959736475