వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు
జోరుగా 'సింగిల్ నెంబర్ లాటరీ'
-ఎఎస్‌పి హేమవతికి సిపిఎం నాయకులు వినతిపత్రం అందజేత
నెల్లూరు:నగరంలో చాపక్రింద నీరులా 'సింగిల్ నెంబర్ లాటరీ' వ్యాపిస్తుందని, ఆరంభంలోనే దాని మూలలను పోలీసులు గుర్తించి కట్టడి చేయాలంటూ సిపిఎం నాయకులు ఎఎస్‌పి హేమవతికి వినతిపత్రం అందజేశారు. సోమవారం ఎస్‌పి కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి 16వ డివిజన్ సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు హాజరై సమస్యను పోలీసు అధికారులు వివరించి పరిష్కరించాలంటూ కోరారు. ఈ సందర్భంగా ఆ డివిజన్ సిపిఎం శాఖ నాయకులు కాయం శ్రీనివాసులు మాట్లాడుతూ 1990 సంవత్సరంలో ఈ సింగిల్ నెంబర్ లాటరీ అనేకమంది ప్రాణాలు బలి కొన్నదని, ఆ మహామ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్లపాలైయ్యాయన్నారు. అటువంటి క్రీడను అప్పటి పోలీసు అధికారులు ఉక్కు పాదం మోపి అణిచివేసి ప్రజల నుంచి మన్ననలు పొందారన్నారు. ప్రస్తుతం మరలా నగరంలో పలు ప్రాంతాల్లో సింగల్ నెంబర్ లాటరీలు చాప కింద నీరు లాగా విస్తరిస్తుందన్నారు. రోజంతా కష్టపడి సంపాదనను సింగల్ నెంబర్లు దార పోసి అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ముఖ్యంగా యువత విద్యార్థులు ఆట మీద మక్కువతో కష్టాలు కొని తెచ్చుకుంటున్నారని ఈ ఆట వల్ల కుటుంబ కలహాలకు కారణమైన అనేక కుటుంబాలు విడిపోతున్నాయన్నాయన్నారు. ఇప్పటికైనా ఈ ఆట మీద పోలీసు అధికారులు ఉక్కు పాదం మోపాలని ముఖ్యంగా నగరంలో 16వ డివిజన్ బాలాజీ నగర్ సంతపేట కోటమిట్ట పొర్లు కట్ట ప్రాంతాల్లో ఈ ఆట ఎక్కువగా జరుగుతున్నట్టు సమాచారం ఉందన్నారు. ఈ ప్రాంతంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి సింగిల్ నెంబర్ ఆటను పూర్తిస్తాయిలో అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.










