ప్రజాశక్తి-వన్‌టౌన్: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు చివరి దశకు చేరడంతో ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారింది. మంగళవారం తొమ్మిదో రోజు దుర్గమ్మ శ్రీ మహిషాసురమర్ధని దేవిగా యాత్రికులకు దర్శనమిచ్చారు. రానున్న రెండు, మూడు రోజులు మాల విరమణ చేసేందుకు భవానీల సంఖ్య పెరగనుంది. అమ్మవారిని రాష్ట్ర మంత్రులు కారుమూరి వెంకటనాగేశ్వరరావు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకష్ణ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎంపి జివిసి నరసింహారావు, ఎమ్మెల్సీ హనుమంతరావు, తెలంగాణ ఎమ్మెల్సీ సమీపూర్ రాజు, ఎమ్మెల్యేలు వసంత వెంకట కష్ణప్రసాద్, కిలారి వెంకట రోశయ్య, హైకోర్టు జడ్జిలు జస్టిస్ డి.వెంకటరమణ, జస్టిస్ బి.ఎస్. భానుమతి, జస్టిస్ రాధాకష్ణ కపాసాగర్ దర్శించుకున్నారు. శరన్నవరాత్రి మహాోత్సవాలలో భాగంగా ఐదో తేదీ బుధవారం విజయదశమిని పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ సందర్శకులకు దర్శనమిస్తారు. బెజవాడ కనకదుర్గమ్మకు టిటిడి తరపున చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా నవరాత్రులు 8వ రోజు సోమవారం వివిధ సేవా టిక్కెట్లు, ప్రసాదాల అమ్మకాల ద్వారా రూ.67.79,940 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇఒ డి.భ్రమరాంబ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజున దుర్గాఘాట్ వద్ద కష్ణా నదిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు తెప్పోత్సవం నిర్వహించేందుకు హంస వాహనాన్ని సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ యస్.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర పోలీస్ కమిషనర్ కాంతిరానా టాటా, ఆలయ ఈవో డి.భ్రమరాంబతో కలిసి తెప్పోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.










