- రెండు నెలల్లో రూ.102.50 వడ్డన
- అనేక నగరాల్లో రూ.1,000 దాటిన సిలిండర్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో అనేక కష్టాలు పడుతున్న ప్రజానీకంపై మరో పిడుగు పడింది. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను భారీగా పెంచింది. శనివారం తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కో సిలిండర్ (14.2 కిలోలు)పై 50 రూపాయల అదనపు భారం ప్రజలపై పడుతుంది. దీంతో రెండు నెలల కాలంలో ఒక్కో సిలిండర్‌పై రూ.102.50 పెంచినట్టైంది. మార్చి 22వ తేదిన రూ.52.50 పైసలు పెంచిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో దేశంలోని అనేక నగరాల్లో సిలిండర్ ధర రూ.1,000 దాటింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు విజయవాడ, హైదరాబాద్‌తో పాటు పలు ఇతర నగరాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం ద్రవ్యోల్భణం అదుపు పేరుతో రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. ఆ చర్య కారణంగా ధరలు అదుపులోకి వస్తాయని ఆర్‌బిఐ చేసిన ప్రకటనకు భిన్నంగా గ్యాస్ ధర పెరగడం గమనార్హం. తాజా పెరుగుదలతో విజయవాడలో సిలిండర్ ధర రూ.1,022కు చేరింది. విశాఖ, తిరుపతిలో కూడా కొంచెం అటు, ఇటుగా ఇదే ధర ఉంది. హైదరాబాద్‌లో ప్రజానీకం 1,052 రూపాయలు సిలిండర్‌కు చెల్లించాలి. చెన్నైలో రూ.1,015.50, కలకత్తాలో రూ.1,026కు సిలిండర్ ధరలు చేరాయి. ఢిల్లీ, ముంబాయిలో రూ.999.50 సిలిండర్‌కు చెల్లించాలి. మరోవైపు వాణిజ్య సిలిండర్ ధరను ఇటీవలే రూ.100 కన్నా ఎక్కువగా పెంచిన సంగతి తెలిసిందే. గృహ వినియోగదారులకు ఇస్తున్న రాయితీని ఇదివరకే పూర్తిగా ఎత్తివేసింది.
తగ్గిన వినియోగం
కేంద్ర ప్రభుత్వం ఒక వైపు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతుండగా, మరోవైపు వినియోగం తగ్గుతోంది. తాజా గణాంకాల ప్రకారం మార్చి నెలలో సిలిండర్ ధరలు పెంచిన తరువాత ఏప్రిల్‌లో దేశ వ్యాప్తంగా వినియోగం తగ్గింది. మార్చితో పోల్చుకుంటే 9.1 శాతం సిలిండర్ల వాడకం తగ్గినట్టు కేంద్ర ప్రభుత్వ ఇంధన వర్గాలు తెలిపాయి. మార్చి నెల 15 వ తేది వరకు ఎల్‌పిజి సిలిండర్ల విక్రమాలు 17 శాతం పెరిగాయి. 22వ తేదిన కేంద్ర ప్రభుత్వం 17 శాతం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత నుండి గ్యాస్ సిలిండర్ల వినియోగంలో తగ్గుదల నమోదైంది.
ఇలా పెరిగింది
కేంద్ర ఇంధన శాఖ మంత్రి గత సంవత్సరం లోక్‌సభలో ఇచ్చిన రాతపూర్వక సమాధానం ప్రకారం 2014 మార్చి ఒకటవ తేదిన వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.410.50గా ఉండింది. గత ఏడాది మార్చి నాటికి రూ.819కు చేరింది. ఢిల్లీ నగరంలోని రేట్లను ప్రాతిపదికగా చేసుకుని ఈ సమాధానమిచ్చినట్లు మంత్రి అప్పట్లో పేర్కొన్నారు. తాజా పెంపుతో ఢిల్లీలో రూ.999.50కు సిలిండర్ ధర చేరింది.
సిలిండర్లతో నిరసన
ప్రజాశక్తి- బొబ్బిలి, పార్వతీపురం : గ్యాస్ ధర పెంపుపై జనాగ్రహం వ్యక్తమైంది. పార్వతీపురం, బొబ్బిలిల్లో గ్యాస్ సిలిండర్లతో సిపిఎం ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. బొబ్బిలిలో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ, గ్యాస్ సిలిండర్లకు ప్రధాని మోడీ ఫొటో పెట్టి మొక్కుతూ వినూత్నంగా మహిళలు నిరసన తెలిపారు. పార్వతీపురంలో నిరసన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరను నియంతృత్వంగా పెంచడం దుర్మార్గమన్నారు. కరోనాతో ఆర్థిక పరిస్థితుల నుంచి నేటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేని ప్రజలపై ధరల మోత మోగించడం దారుణమని పేర్కొన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరల వల్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితులు కుదేలైపోతున్నా యన్నారు. ఇటువంటి తరుణంలో ధరలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాల్సి ఉందని తెలిపారు. గ్యాస్ ధరను రూ.50 పెంచి మరింత భారం మోపడం తగదన్నారు. ఇదే వైఖరి మోడీ ప్రభుత్వం అవలంభిస్తే మనదేశానికి శ్రీలంక గతే పడుతుందని హెచ్చరించారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఇందిర, పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలిలో నిరసనలో సిపిఎం నాయకులు పి.శంకర్రావు మాట్లాడారు.










