దేశ నలుమూలల నుంచి ఢిల్లీ తరలివచ్చి పాలక పెద్దల గడప ముందు అన్నదాతలు గర్జన చేస్తున్నా కేంద్రానికి పట్టడం లేదు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి మొదలు వరుస వినాశకర విధానాలతో చితికిపోయిన సగటు భారతీయుడి న్యాయాగ్రహానికి రైతన్నల పోరాటం దర్పణం పడుతోంది. వీరికి మద్దతుగా దేశమంతటా సంఘీభావ సమరం సాగిస్తున్నారు. ప్రజాగ్రహం ఇంతలా వెల్లువెత్తుతున్న ఈ నేపథ్యంలో సోయి వున్న ఏ సర్కారైనా భారాలు మోపేందుకు వెనుకా ముందు ఆలోచిస్తుంది. కానీ బిజెపి ప్రభుత్వానికి మాత్రం ఆ సోయి ఇసుమంతైనా లేకపోయింది.
ఇప్పటికే దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు నిత్యం ఎగబాకుతూనే వున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు పేదవాడి పొయ్యి పైనా మోడీ సర్కార్ కన్ను పడింది. వరుస ధరాఘాతాలకు చిక్కి శల్యమవుతున్న సగటుజీవి నెత్తిన మరో మారు గుది 'బండ' మోపింది. సబ్సిడీ సిలిండర్ ధరను ఏకంగా రూ.50 పెంచేసింది. తాజా పెంపుతో దేశ రాజధానిలో ప్రస్తుతం రూ.594గా ఉన్న సబ్సిడీ సిలిండర్ ధర రూ.644కు పెరిగింది. రాష్ట్రంలో కర్నూలులో రూ.649 నుంచి రూ.699కి, విజయవాడలో రూ.616.50 నుంచి రూ.666.50కి, విశాఖలో రూ.602 నుంచి రూ.652కి గ్యాస్ ధర ఎగబాకింది. గృహ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌పై రాయితీ కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సంవత్సరానికి 12 సిలిండర్లకు మాత్రమే రాయితీ పరిమితం. వాస్తవానికి ఆధార్, ఫోన్ లింకేజీ తదితర సమస్యల వల్ల గ్రామీణ, పట్టణ పేదల్లో చాలా మంది రాయితీ పొందలేకపోతున్నారు. మరోవైపు పెట్రోలు, డీజిలు ధరలు శుక్రవారం కూడా పెరిగాయి. పెట్రోలుపై లీటరకు 6 పైసలు, డీజిల్‌పై 16 పైసలు చొప్పన భారం మోపింది. దీంతో ఢిల్లీలో చమురు ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రాజధానిలో లీటరు పెట్రోలు ధర రూ.81.59, ముంబయిలో రూ.88.29, చెన్నరులో రూ.84.64, కోల్‌కతాలో రూ.83.15 ఉండగా...డీజిల్ ధర ఢిల్లీలో రూ.71.41, ముంబయిలో రూ.77.90, చెన్నరులో రూ.76.88, కోల్‌కతాలో రూ.74.98కి పెరిగింది.
వాస్తవానికి వినియోగదారుడు చెల్లించే ధరలో అసలు ధర కంటే కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విధించే పన్నులు, సుంకాల వాటానే అధికం. పెట్రోలు, డీజిల్ ధరల్లో 254 శాతం పన్నులు, సంకాలే ఉంటున్నాయి. అంటే ప్రజానీకాన్ని ప్రభుత్వాలు జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నాయన్నమాట. ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బారెల్ 57 డాలర్లుగా ఉండేది. అది ఇప్పుడు కరోనా సంక్షోభం తర్వాత ఇటీవల స్వల్పంగా పెరిగినా కూడా 47 డాలర్లుకు పడిపోయింది. కానీ అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీలు, వ్యాట్‌లు పెంచుతూ జనాల సొమ్మును జుర్రుకుంటున్నాయి.
అప్పటికే అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై సమ్మెటపోటైన కరోనా నేపథ్యంలో సగటు జీవి బతుకు బండి ఆగిపోయింది. ఈ దశలో ప్రజల కొనుగోలు శక్తి పెంచి ఉత్పాదక డిమాండ్ పెంచాల్సిన పాలకులే దారిదోపిడి దొంగల్లా ప్రజల వద్ద ఉన్న అరకో పరకో కూడా లాగేసుకొని ఖజానాలు నింపుకోవడం సిగ్గుమాలిన చర్య. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టిన దశలో దేశంలో ఇంధన ధరలపై అధిక సెస్ విధించి ప్రజలకు దక్కాల్సిన మిగులు ధరను మోడీ సర్కార్ కాజేసింది. ఇప్పుడు ముడి చమురు ధరలు పెరుగుతున్నాయంటూ ఇంధన ధరలు పెంచేస్తోంది. చమురు ధరలు తగ్గినా..పెరిగినా దండుకోవడం మాత్రం ఖాయం.
ఖజానా నింపుకోవడానికి సర్కార్‌కు ప్రజలపై భారాలు మోపడం కాకుండా వేరే ప్రత్యామ్నాయం లేదా? వాస్తవానికి దేశంలో నయా ఉదారవాద విధానాల అమలు వల్ల ఆర్థిక అసమానాతలు పెరిగిపోతున్నాయి. సంపద అంతా అంబానీలు, అదానీలు, టాటా, బిర్లాలు వంటి కొంత మంది బడా కార్పొరేట్ పెద్దల వద్దే పోగుబడిపోతోంది. వీరిపై కనీసం రెండు శాతం వెల్త్ ట్యాక్స్ వసూలు చేసినా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. రుణమాఫీలైనా, ఉద్దీపన ప్యాకేజీలైనా అగ్ర తాంబూలం బడా కార్పొరేట్లకే అందిస్తూ మోడీ సర్కార్ వివక్ష చూపుతోంది. సామాన్యుడి చెంత చిల్లిగవ్వ లేకుండా సర్వం దోచుకునే విధానాలతో ముందుకెళ్తోంది. ఈ విధానాల వలన ద్రవ్యోల్బణం రంకెలు వేసి ఆర్థిక అల్లకల్లోలానికి దారితీస్తుందే తప్ప దేశ ప్రగతికి ఏమాత్రం దోహదం చేయదు.










