Jul 12,2021 15:48

ముంబయి : బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌పై మధ్యప్రదేశ్‌లోని మాండ్సర్‌కు చెందిన బిజెపి ఎంపి సుధీర్‌ గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా పెరిగిపోవడానికి ఆమీర్‌ఖాన్‌ లాంటి వారే కారణమని అన్నారు. మొదటి భార్య రీనాతో ఆమీర్‌ఖాన్‌ ఇద్దరు పిల్లల్ని కన్నాడని, రెండో భార్య కిరణ్‌తో ఒక సంతానం ఉందని, ఇప్పుడు మూడో భార్య కోసం వెతుక్కుంటున్నారని అన్నారు. ప్రపంచానికి భారత్‌ ఇచ్చే సందేశం ఇదేనా? అని వ్యాఖ్యానించారు. దేశంలో జనాభా అసమానతలకు ఆమీర్‌ఖాన్‌ లాంటి వారే కారణం కావడం దురదృష్టకరమన్నారు. జనాభా దినోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో భారత భూభాగం పెరగకపోయినా జనాభా మాత్రం పెరిగిపోయిందన్నారు. అది దేశానికి ఏ మాత్రం మంచిదికాదన్నారు. దేశ విభజన సమయంలో ఎక్కువ భూభాగం, తక్కువ జనాభాతో పాకిస్థాన్‌ ఏర్పాటైందని గుర్తు చేశారు. కాబట్టి జనాభా నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు.