- మైనర్ పంచాయతీల్లో పైప్‌లైన్ నిర్వహణకు నిధులు లేమి
- రెండు నెలల్లో మూడు గ్రామాల్లో ప్రబలిన అతిసార
- 100 మందికి పైగా బాధితులు
- జిల్లాలో ఆరుగురు మృతి
ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి
ఇంటింటికి కుళాయి అమర్చుతాం. పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేస్తాం. ఇలా గత కొన్నాళ్ళుగా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం చెబుతున్న మాటలు అచరణకు నోచుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లోనే గత రెండేళ్ళుగా ఆర్థిక సంఘం నిధులు అందక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకాల నిర్వహించలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా పైప్‌లైన్ లీకేజీలు సకాలంలో మరమ్మతులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. పైప్‌లైన్ లీకుల్లోకి డ్రైయిన్ నీళ్లు వెళ్ళి తాగునీరు కలుషితమై రెండు నెలల వ్యవధిలో జిల్లాలోని మూడు గ్రామాల్లో అతిసార ప్రభలింది. ఆరుగురు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
గన్నవరం మండలంలోని తెంపల్లి గ్రామంలో 60 మంది అతిసార వ్యాధి భారిన పడ్దారు. ఐదుగురు మృతి చెందారు. పంచాయతీ నిర్వహణకు కనీస నిధులు లేవని గ్రామ సర్పంచ్ జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. మే నెలలో పామర్రు మండలంలోని బలిపర్రులో 25 మందికి అతిసారసోకింది. ఒకరు మరణించారు. దీనికి కొన్ని రోజులు ముందు మండల కేంద్రమైన పామర్రులో 15 మంది వ్యాధి భారిన పడ్డారు. ఈ ఏడాది మూడు గ్రామాల్లో పంచాయతీల్లో 100 మంది ఈ వ్యాధి భారిన పడ్డారు. ఆరుగురు మృతి చెందారు.
ఆర్ధిక లేమి ....ఫిల్టర్ బెడ్‌లు, పైప్‌లైన్‌ల నిర్వహణలో నిర్లక్ష్యం.
పునర్విభజన తర్వాత కృష్ణాజిల్లాలో నాలుగువందలకుపైగా పంచాయతీలున్నాయి. వెయ్యి జనాభాలోపున్న మైనర్ పంచాయతీ నిర్వహణకు కనీసంగా ఏడాదికి రూ. రెండు లక్షలు ఖర్చవుతుందని అంచనా. వీటికి పన్నుల ద్వారా అంత మొత్తం రాబడి ఉండదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్ధిక సంఘం నిధులను గ్రామీణ రక్షిత మంచినీటి పథకాలు, పారిశుధ్య నిర్వహణకు వినియోగిస్తారు. 14వ ఆర్దిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులకు జమ చేసింది. 15వ ఆర్ధిక సంఘం నిధులు ఇప్పటి వరకు విడుదల కాలేదు. దీంతో తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటున్నారు. కనీసంగా పారిశుధ్య నిర్వహణకు బ్లీచింగ్ కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. రక్షిత జలాల శుధ్ధికి అవసరమైన పిల్టర్‌బెడ్‌ల మరమ్మతులు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొందని పలువురు సర్పంచ్‌లు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే పంచాయతీల్లో పారిశుధ్యం, రక్షిత పథకాల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.










