అనంతపురం ప్రతినిధి : జగనన్న జలకళకు ఇక నుంచి విద్యుత్ కనెక్షన్, మోటర్ల ఏర్పాట్లను లబ్ధిదారులే చూసుకోవాలని ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని అధికారులు వెల్లడించారు. మొదటి దశ వేసిన జలకళకు మాత్రం విద్యుత్ కనెక్షన్, మీటర్లు వేస్తామని అధికారులు స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని సర్వసభ్య సమావేశం హాలులో శనివారం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాచరణ్ శ్రీ, మండలి విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, శ్రీధర్‌రెడ్డిలు హాజరయ్యారు. రెండు జిల్లాల కలెక్టర్లు నాగలక్ష్మి సెల్వరాజన్, బసంత్‌కుమార్ పాల్గొన్నారు. సమావేశంలో పలువురు సభ్యులు సమస్యలను ఏకరువు పెట్టారు. కంబదూరు జడ్పిటిసి మాట్లాడుతూ జలకళ కింద బోర్లు వేసినప్పటికీ విద్యుత్ కనెక్షన్లు ఇంతవరకు ఇవ్వలేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కలెక్టర్ నాగలక్ష్మి స్పందిస్తూ జలకళకు సంబంధించి విద్యుత్ కనెక్షన్ మొదటి విడతలో వేసిన బోర్లకు మాత్రమే ఇస్తామన్నారు. ఆ తరువాత విడతలో కేవలం బోర్లు మాత్రమే వేస్తారని, కనెక్షన్‌ను రైతులే తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆ రకంగా ప్రభుత్వ మార్గదర్శకాల్లో మార్పులు జరిగాయని వివరించారు. రైతు భరోసా కేంద్రాల్లో యూరియా తప్పా ఇతర ఎరువులేవీ ఉండటం లేదని ఆమడగూరు జెడ్పీటీసీ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అన్నింటినీ అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పుట్టపర్తి జెడ్పీటీసీ మాట్లాడుడుతూ సత్యసాయి జిల్లాలో ఉద్యానవన అధికారులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యానవన అధికారులు ఎందరున్నారో చెప్పాలని అధికారులను అడిగారు. దీనిపై ఉద్యానవన శాఖ ఎడి చంద్రశేఖర్ మాట్లాడుతూ సత్యసాయి జిల్లా పరిధిలో మొత్తం పది మంది ఉద్యానవ అధికారుల పోస్టులు ఉన్నాయని, వీరిలో నలుగురు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దీంతో ఒక్కో అధికారికి పది మండలాలకు ఇన్‌ఛార్జీగా వ్యవహరించాల్సి వస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేయిన్‌గన్‌లు, నీటి పైపులు ఎక్కడున్నాయో చెప్పాలని బెళుగుప్ప జెడ్పీటీసీ ప్రశ్నించారు. దీనిపై పదేపేద చర్చకు వస్తున్నా రికవరీ చేసే చర్యలు అధికారులు చేపట్టడం లేదని ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిలు తెలిపారు. ఇందుకు జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ మాట్లాడుతూ రెయిన్‌గన్‌లు ఎక్కడున్నాయన్న దానిపై నివేదిక రూపొందించామని, అందులో 20 నుంచి 30 శాతంలోపే పనిచేసే విధంగా ఉన్నాయన్నారు. వాటి రికవరీకి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపామని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గృహ నిర్మాణ అంశంపై కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ అనంతపరం జిల్లాలో 60 వేల ఇళ్లుమంజూరయితే ఆరు వేలు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. వచ్చే ఉగాది నాటికి 20 వేల ఇళ్లు పూర్తి చేయాలన్నది లక్ష్యమని తెలిపారు. రెండు మాసాల వ్యవధిలో 14 వేల ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. అందుకు అందరి సహకారం అవసరం అవుతుందని చెప్పారు. అదే విధంగా 2024 నాటికి మొత్తం ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేసుకోకపోతే కేంద్రమిచ్చిన నిధులు వెనక్కు వెళ్లే అవకాశాలున్నాయని, కావున లబ్ధిదారుల్లో అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయించేందుకు ప్రయత్నించాలని సభ్యులను కోరారు. గృహ నిర్మాణ శాఖలో నిధుల కొరత లేదని అధికారులు సైతం చెబుతున్నారని, లేఅవుట్ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విధంగా అధికారులు ప్రత్యేకంగా చొరవ చూపాలని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీ అంశంపై బుక్కరాయసముద్రం భాస్కర్ జెడ్పీటీసీ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లలు పౌష్టికాహారం లోపాలు అదే విధంగా కొనసాగుతున్నాయని, ప్రభుత్వం పౌష్టికాహారం ఇస్తున్నా ఎందుకు వారిలో ఆలోపాలు పోవడం లేదో పరిశీలించాలని కోరారు. అదే విధంగా అంగన్‌వాడీ టీచర్లు పూర్తి సమయం విధుల్లో ఉండటం లేదని, చర్యల తీసుకోవాలని కోరారు. దీనికి సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ మాట్లాడుతూ ఇప్పుడు ఉద్యోగులందరికీ పేషియల్ యాప్‌లో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది కాబట్టి, ఇక నుంచి పూర్తి సమయంలో ఉద్యోగులు ఉండాల్సి వస్తుందని చెప్పారు. ఇలా పలువురు సభ్యులు సమావేశంలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం
స్త్రీ,శిశుసంక్షేమ శాఖా మంత్రి ఉషశ్రీ చరణ్
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని మంత్రి ఉషశ్రీచరణ్ తెలిపారు. జెడ్పీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీల్లో నాణ్యమైన ప్రీ ప్రైమరీ విద్య అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. నాడు-నేడు ద్వారా నూతన అంగన్ వాడీల నిర్మాణం, ఇప్పటికే ఉన్న అంగన్ వాడీ భవనాల మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు. అద్దె గదుల్లో నిర్వహిస్తున్న కేంద్రాలకు అద్దె ఖర్చుల కోసం ఎక్కువ మొత్తం చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన 'బాలామతం ప్లస్'ను రాష్ట్రంలోని ప్రతి పిల్లవాడికీ అందించే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు










