Aug 03,2022 23:28

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌: జిఒ నెంబర్‌ 117ని రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న పాఠ్య పుస్తకాలు, విద్యా కానుక వెంటనే విడుదల చేయాలని విజయవాడలోని పడమటలంక హైస్కూల్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడలో పాఠశాలల్లోని విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న నేటికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, జగనన్న విద్యా కానుక ఇవ్వలేదన్నారు. పాఠ్యపుస్తకాలు లేకపోవడం వల్ల విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలు అర్థం కావడంలేదని తెలిపారు. మున్సిపల్‌ పాఠశాలల్లో గదులు సరిపోక ఒక్కో గదిలో 80 మందికి పైగా కూర్చోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని, మధ్యాహ్న భోజననాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను మానుకోవాలని, జగనన్న గోరుముద్ద పథకంలో విద్యార్థులకు సన్న బియ్యం సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమారస్వామి, రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.