Jan 01,2023 09:07

విలేకరులతో మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌

      పుట్టపర్తి అర్బన్‌: సత్యసాయి జిల్లాలో 2022 సంవత్సరంలో నేరాలు గణనీయంగా తగ్గాయని ఎస్పీ రాహుల్‌ దేవ్‌ సింగ్‌ తెలిపారు. శనివారం నాడు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన నేరాలు, నియంత్రణ తదితర వాటి వివరాలను మీడియాకు వెల్లడించారు. 2022లో పోలీసుల పనితీరు ప్రశంసనీయంగా ఉందన్నారు. అరాచక శక్తులపై ఉక్కు పాదం మోపారని తెలిపారు. పటిష్టమైన రోడ్డు భద్రత చర్యలు చేపడుతూ ప్రమాదాల నివారణకు గణనీయంగా కషి చేశామన్నారు. హత్యలు, అత్యాచారాలు గత ఏడాది కంటే తగ్గాయన్నారు. ఫోక్స్‌ కేసులు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు తగ్గాయని ప్రజలకు జవాబుదారీగా ఉంటున్నామన్నారు. ప్రజలు పోగొట్టుకున్న సొత్తులో 2,350 కోట్లు జిల్లాలో రికవరీ చేశామన్నారు. అక్రమ మద్యం తయారీతో పాటు విక్రయిస్తున్న నలుగురిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశామని వారిలో ఇద్దరిని జిల్లా బహిష్కరణకు ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపామన్నారు. మహిళా పోలీసుల ద్వారా మహిళల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. సైబర్‌ నేరాలపై ప్రత్యేక దష్టి పెట్టమన్నారు. జిల్లా ఇప్పటివరకు లాక్‌అదాలత్‌లో 4277 కేసులు పరిష్కరించామన్నారు. అక్రమ మద్యం, ఇతర నేరాలపై పట్టుకున్న 1599 వాహనాల వేలంలో 4.70 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందన్నారు. డయల్‌ 100కు 2022లో 6286 కాల్స్‌ వచ్చాయన్నారు. కొత్త జిల్లాలో అతి తక్కువ సమయంలోనే స్థానికంగా పరేడ్‌ సిద్ధం చేశామన్నారు.
నూతన సంవత్సరం పేరుతో చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు
నూతన సంవత్సరం పేరుతో మద్యం తాగి అల్లరి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాలను హోటళ్లను నిర్ణీత సమయానికి మూసివేయాలన్నారు. ప్రశాంతి నిలయం చుట్టూ ఎలాంటి హంగామా చేయరాదని నిషేధం విధించమన్నారు. బైకులలో హంగామా చేయరాదని, రహదారులను కేకులు కట్‌ చేయరాదని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్‌పి రామకష్ణ ప్రసాద్‌ పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు : కలెక్టర్‌
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌ నుంచి ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఏడాదిలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆదివారం కలెక్టరేట్‌లో తనతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అందుబాటులో ఉంటామన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారు, బొకేలు స్వీట్‌ బాక్స్‌లు, కేకులు తీసుకురావద్దన్నారు. గులాబీ పువ్వు, లేదా ఒక మొక్క మాత్రమే ఇవ్వాలన్నారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ కోసం విరాళాలు అందించాలని కోరారు. కరోనా తిరిగి పంజా విసురుతోందని ప్రజలందరూ కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించి ఆరోగ్యాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.