Dec 26,2022 22:18

విలేకరులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

          పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో డా||వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద పకడ్బందీగా రీసర్వే చేపడుతున్నామని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం నాడు పుట్టపర్తి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌తో కలిసి నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద జిల్లాకు 3,486 భూహక్కు పత్రాలు ప్రింట్‌ చేసి పంపామన్నారు. ఇందులో 79 తప్ప మిగతా వాటిలో రకరకాల తప్పులు దొర్లాయన్నారు. తప్పులుదొర్లిన వాటిని సరి చేసేలా మళ్లీ వెనక్కు పంపామన్నారు. పూర్తి స్థాయిలో వచ్చిన భూ హక్కు పత్రాలను సంక్రాంతి లోపు పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో 461 గ్రామాలకు గాను 333 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తి చేశామన్నారు. డ్రోన్‌ సర్వే పూర్తి అయిన తర్వాత సర్వే ఆఫ్‌ ఇండియా నుంచి ప్రింట్‌ అయి వచ్చిన ఒఆర్‌ఎస్‌ ఇమేజెస్‌ 57 మాత్రమే అయ్యాయని, 26 గ్రామాల్లో తుది ఆర్‌ఒఆర్‌ పనులు పూర్తయ్యాయని తెలియజేశారు. దీనిపై ఎవరికి అభ్యంతరాలున్నా ఫామ్‌-8 ద్వారా ఫిర్యాదు చేయొచ్చన్నారు. రీ సర్వే విషయంలో ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. అవినీతి, తప్పులకు ఆస్కారం లేకుండా రీ సర్వే చేపడతామని చెప్పారు.
7,422 మంది లబ్ధిదారులకు రూ.11.84 కోట్ల పంపిణీ
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన నవరత్నాలు - లబ్ధిదారులకు ద్వైవార్షిక నగదు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి గతంలో వివిధ కారణాలతో లబ్ధి పొందని వారిని గుర్తించి ఈ సాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో అర్హులైన 7,422 మంది లబ్ధిదారులకు రూ.11.84 కోట్ల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
అర్హుల పింఛన్లు తొలగించం
జిల్లా వ్యాప్తంగా పింఛన్లపై సర్వే కొనసాగుతోందని, ఇందులో అర్హుల పింఛన్లు ఎవరివీ తొలగించమని దీనిపై లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి జిల్లా వ్యాప్తంగా 8,660 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. నోటీసులు ఇచ్చిన వారందరి పింఛన్లు తొలగిస్తామని భావించాల్సిన అవసరం లేదన్నారు. అధికారుల పూర్తి స్థాయి విచారణ అనంతరం మాత్రమే అనర్హుల పింఛన్లు తొలగిస్తామని చెప్పారు.
మొక్క మాత్రమే చాలు
జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారు ఒక మొక్క, గులాబీ పువ్వు మాత్రమే ఇస్తే చాలని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ సూచించారు. తాను, జాయింట్‌ కలెక్టర్‌, తదితరులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జనవరి 1వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అందుబాటులో ఉంటామని చెప్పారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అధికారులు, ఇతరులు బొకేలు, స్వీట్‌ బాక్స్‌ లు, కేకులు తీసుకురాకూడదన్నారు. వాటి స్థానంలో ఒక గులాబీ పువ్వు, ఉపయోగపడేందుకు వీలున్న మొక్క ఇస్తే చాలన్నారు. జిల్లాలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ మొదలుకాని నేపథ్యంలో బ్లడ్‌ బ్యాంక్‌, జన ఔషధీ మెడికల్‌ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా విరాళాలు అందించాలన్నారు.