ప్రజాశక్తి-శింగనమల రైతులకు ఇచ్చిన బ్యాంకు రుణాలను వెంటనే మాఫీ చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుసంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సచివాలయ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు సహాయ చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మరోవైపు హెచ్‌ఎల్‌సి, హంద్రీనీవాకు నీరు వదలకపోవడంతో చేతికి వచ్చే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. కావున పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుంకన్న, జయరాముడు, రామాంజనేయులు, ఓబులేసు, లక్ష్మీనారాయణ, కేసన్న, మునెప్ప, రామాంజనేయులు, ఆంజనేయులు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.