కదిరి టౌన్ : పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో శనివారం ఉదయం జిల్లా స్థాయి మార్షల్ ఆర్ట్స్ క్రీడా పోటీలను నిర్వహించారు. బాలికల పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు దానమయ్య, మాస్టర్ షాకీర్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. ఇందులో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలోని పాఠశాల స్థాయి విద్యార్థులు పాల్గొన్నారు. ఖావంకీ, లోబో విభాగాల్లో పాల్గొని వారి ప్రతిభను కనపరిచారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. గాండ్లపెంట కస్తూరిబాగాంధీ బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మద్దిమడుగు తేజశ్రీ రాష్ట్ర సాయి క్రీడా పోటీలకు ఎంపిక అయ్యింది. రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారు నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో ఈనెల 17, 18న జరిగే పోటీల్లో పాల్గొంటారని మార్షల్ ఆర్ట్స్ మాస్టార్ షాకీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ కార్యదర్శి రవి, జిల్లా ఏపీ పీడీ అసోషియేషన్ అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు బయరెడ్డి, నరసింహారెడ్డి, లష్కర్ నాయక్, రాజాశేఖర్, బాబా, లక్ష్మీనారాయణ, కేశవమూర్తి, గోపాల్ రెడ్డి, రాజశేఖర్, ప్రసాద్, ఆదినారాయణ, శివ, రాష్ట్ర మార్షల్ ఆర్ట్స్ ఛైర్మన్ ఇస్మాయిల్, రెఫరీలు ఖాదర్, చాందిని, అనంతపురం జిల్లా కోచ్ మురళికష్ణ రెడ్డి, వ్యాయమ ఉపాధ్యాయురాలు మంజు భార్గవి పాల్గొన్నారు.










