ప్రజాశక్తి-నందిగామ: ఈ నెల 27, 28 తేదీల్లో కొండపల్లిలో జరిగే ఐద్వా ఎన్టీఆర్ జిల్లా 20వ మహాసభను జయప్రదం చేయాలని ఐద్వా ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి శ్రీదేవి పేర్కొన్నారు. బుధవారం నందిగామ మండలం ఐద్వా నాలుగో మహాసభ స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో జరిగింది. సభలో శ్రీదేవి, జిల్లా కమిటీ నాయకులు ఎన్‌సిహెచ్ సుప్రజ మాట్లాడుతూ ప్రభుత్వాల విధానాల వల్ల మహిళలపై దాడులు జరుగుతున్నాయని, గృహహింస పెరుగుతుందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు విలీనం చేయడం వల్ల పేద పిల్లలకు విద్య అందటం లేదని, మహిళల్లో అక్షరాస్యతా శాతం తగ్గుతుందని పేర్కొన్నారు. మద్యపానాన్ని నిషేధిస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మద్యం షాపులను పెంచుతుందని విమర్శించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారని ప్రభుత్వాలు మహిళా అభ్యుదయం కోసం పనిచేయాలని కోరారు. అనంతరం నూతన మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షులుగా కాండ్రాతి మల్లేశ్వరి, కార్యదర్శిగా ఆదూరి సుశీల, సహాయ కార్యదర్శిగా ఉప్పుతోళ్ల కుమారి, కోశాధికారిగా నాగమణి, ఉపాధ్యక్షురాలుగా సరళ, కమిటీ సభ్యులుగా కోయ నాగేంద్రం, తాటి తులసమ్మ, సయ్యద్ బాజిద్ బితో పాటు మరో ఇద్దరు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు.










