Mar 25,2023 20:58

ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులు

ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులు
జిజిహెచ్‌లో మౌలిక వసతులు కరువు
-సిపిఎం రూరల్‌ కమిటీ ధర్నా
నెల్లూరు :నగరంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మౌళిక వసతులు కరువైపోయాయని, జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి జిజిహెచ్‌లో మౌళిక వసతుల మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఎం రూరల్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. శనివారం సిపిఎం రూరల్‌ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ ప్రతి నిత్యం జిల్లా నలుమూలల నుంచి వైద్య చికిత్సల నిమిత్తం ప్రజలు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు వస్తుంటారని, అనారోగ్యంతో వచ్చిన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యసేవలందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు
. ప్రధానంగా ప్రధాన వైద్యశాలలో కనీస మౌళిక వసతులు కనుమరుగు అయిన కారణంతో రోగులు, వారి సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణణాతీతమన్నారు. ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మౌలిక వసతులు మెరుగుపరచాలని డిమాండ్‌ చేసినారు. ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఏర్పాటుచేసిన 8 లిఫ్ట్లు కొన్ని నెలలుగా పనిచేయకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లాలో ప్రతి నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటాయని, ఈ ప్రమాదాల్లో గాయపడిన వారికి వైద్య చికిత్సలు అందజేసేందుకు 108 వాహనాల్లో ప్రభుత్వ వైద్యశాలలకు తీసుకొస్తారన్నారు. గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆపరేషన్‌ థియటర్‌కు తరలించి శస్త్ర చికిత్సలు చేయాల్సి పరిస్థితి ఏర్పడితే ఆ సమయంలో వారి బాధలు చెప్పనలివి కాదన్నారు. మెడికల్‌ కళాశాల అధ్యాపక సిబ్బంది మాత్రమే వాడుకొనేందుకు రెండు లిఫ్టులు పనిచేస్తున్నాయని, ఏదైనా సమయంలో ఆ లిఫ్టులు మరమ్మత్తులకు గురైతే వెంటనే సరిచేయించి వాడకంలోకి తీసుకొచ్చుకుంటారని ఇది ఎంత వరకు న్యాయమన్నారు. ఇప్పటికై జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే వాటి మరమ్మత్తులు చేసి వాడకంలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే రోగులకు సేవలందించేందుకు అవసరమైన ఎంఎన్‌ఓ,ఎఫ్‌ఎన్‌ఓలు లేకపోవడంతో వైద్య ఆరోగ్య సేవలు సకాలంలో అందడం లేదని, అధికారులు ఈ సమస్యను సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవసరమైన మేరకు వారి సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలన్నారు. సిపిఎం రూరల్‌ కార్యదర్శి బత్తల కష్ణయ్య మాట్లాడుతూ అన్ని రకాల మందులను జిజిహెచ్‌ లో అందుబాటులోకి తిరిగి తీసుకురావాలని కోరినారు. అలాగే అన్ని రకాల ల్యాబ్‌ టెస్టులను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. కోట్లాది రూపాయలు ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన ప్రభుత్వ వైద్యకళాశాల, అనుబంధ వైద్యశాలలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ తరహాలో వైద్యం అందించాలని డిమాండ్‌ చేసినారు. శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బందికి బకాయి జీతాలను చెల్లించాలని కోరారు.ఈ సమస్యలను పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ధర్నా అనంతరం సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు కిన్నెర కుమార్‌, కొండ ప్రసాద్‌, సిపిఎం రూరల్‌ కమిటీ సభ్యులు సంపత్‌ కుమార్‌ , వీర్ల శ్రీనివాసులు , ఎం.సుధాకర్‌ , సిపిఎం శాఖ కార్యదర్శి ఎస్‌.కె కాలేషా, ఎన్‌.రమణయ్య, నరసయ్య, వెంకీ, ఖలీల్‌, డివైఎఫ్‌ఐ రూరల్‌ కార్యదర్శి కండె కోటేశ్వరరావు, డివైఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు డబ్బుగుంట శ్రీనివాసులు ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.