Jan 10,2023 21:14

తహశీల్దార్‌ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న సిఐటియు నాయకులు

       హిందూపురం : రాజ్యాంగం కల్పించిన నిరసన, ఆందోళన తెలిపే హక్కును హరించే విధంగా ప్రజల గొంతును నొక్కి వైసిపి ప్రభుత్వం తెచ్చిన జీవో :1ని తక్షణం రద్దు చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప డిమాండ్‌ చేశారు. జీవో :1ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో నిరసన తెలిపారు. సిఐటియు కార్యాలయం నుంచి బాలాజీ సర్కిల్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌, అంబేద్కర్‌ సర్కిల్‌ మీదుగా తహశీల్దార్‌ కార్యలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా నరసింహప్ప, మున్సిపల్‌ పారిశుధ్య కార్మిక సంఘం నాయకులు జగదీష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, ఆటో యూనియన్‌ నాయకులు నాగరాజులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కును, ప్రజల భావప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా జీవోలు తేవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలను కార్మికులు, రైతులు, ఉద్యోగులు, ప్రజలు ఐక్యంగా పోరాడి తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు పి.జగదీష్‌, రామకష్ణ, అత్తర్‌ బాబా, జబి, చంద్ర, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు మల్లికార్జున, ఆనందప్ప, ఆటో యూనియన్‌ నరేష్‌, సాదిక్‌ పాల్గొన్నారు.