Jul 04,2021 10:20

ఇండిస్టీలోకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు... పోతుంటారు. కానీ, వారిలో కొంతమంది మాత్రమే తమ మార్క్‌ ట్రెండ్‌ క్రియేట్‌ చేసి, ఇండిస్టీలో ఎప్పటికీ నిలిచిపోతారు. అలాంటి వారిలో డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ ఒకరు. అయితే ఈ టాలీవుడ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ సినిమాల ద్వారానే కాదు... సోషల్‌ మీడియానూ వేదికగా చేసుకొని సమాజానికి సంబంధించి మెసేజ్‌లు ఇస్తున్నారు. తరచూ రకరకాల సరికొత్త అంశాలను చర్చిస్తున్నారు. పోడ్‌ కాస్ట్‌ రూపంలో తన ఆలోచనలను అందరితో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు వివిధ విషయాలపై ఆయన స్పందిస్తూ.. తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. 'పూరీ మ్యూజింగ్స్‌' పేరుతో అందరినీ ఆకట్టుకుంటున్న పూరీ.. తాజాగా వైబ్‌ అనే కాన్సెప్ట్‌ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

పూర్తిపేరు : పీతల పూరి జగన్నాథ్‌
పుట్టిన తేదీ : 1966 సెప్టెంబర్‌ 28
పుట్టిన ప్రాంతం : పిఠాపురం, తూర్పుగోదావరి
భార్య : లావణ్య
పిల్లలు : ఆకాష్‌ పూరీ, పవిత్ర జగన్నాథ్‌
సోదరులు : సాయిరామ్‌ శంకర్‌, ఉమాశంకర గణేష్‌

    బద్రి సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు పూరీ జగన్నాథ్‌. కెరీర్‌ మొదట్లోనే బంపర్‌ హిట్లతో అలరించాడు. పవన్‌ కళ్యాణ్‌ తో తీసిన బద్రి సినిమా అటు పవన్‌కి, ఇటు పూరీకి ఎంతో పేరు తెచ్చింది. ఇక ఆతరువాత రవితేజ తో తీసిన 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం', 'ఇడియట్‌', 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' వరుస హిట్లతో ఇండిస్టీలో పూరీ పేరు మారుమోగిపోయింది. ఈ సినిమాలతో రవితేజ స్టార్‌ డమ్‌ కూడా పెరిగిపోయింది. ఈ తరువాత 'శివమణి', 'దేశముదురు', 'చిరుత' లాంటి సినిమాలతోనూ అలరించాడు. సహజంగానే ముక్కుసూటిగా మాట్లాడే పూరీ జగన్నాథ్‌.. సినిమాలతో పాటు...సమాజానికీ ఏదో ఒక మెసేజ్‌ ఇవ్వాలని చూస్తుంటారు. ఓ సందర్భంలో ఇండిస్టీ గురించి మాట్లాడుతూ... ఇక్కడ ఎవరికి జాలి, దయ, కరుణ ఉండవు.. ఇక్కడ మనుషుల్ని మనుషుల్లాగా ట్రీట్‌ చేయడం ఎప్పుడో మానేశారని చెప్పాడు.
    ఇక అసలు విషయానికొస్తే డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తాజాగా పూరీ మ్యూజింగ్స్‌ వేదికగా వైబ్‌ అనే కాన్సెప్ట్‌ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ఒక మనిషి నెగిటివ్‌ మైండ్‌ పెట్టుకుని పాజిటివ్‌ లైఫ్‌ కావాలంటే కుదరదని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలిపారు. ఒక మనిషిని చూడగానే ఏదో తెలియని సంతోషం పాజిటివ్‌ ఫీలింగ్‌ కలుగుతుందని తెలిపారు. అదే వేరొక మనిషిని చూడగానే వీడు ఎందుకు వచ్చాడు అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్స్‌నే వైబ్స్‌ అంటారని చెప్పుకొచ్చారు.
     వైబ్స్‌లో గుడ్‌ వైబ్స్‌, బ్యాడ్‌ వైబ్స్‌ ఉంటాయి. ప్రతి మనిషి నుంచి ఒక వైబ్రేషన్‌ వస్తుంది. ఒక ఎనర్జీ రిలీజ్‌ అవుతుంది. మన నుంచి వచ్చే ఎనర్జీ ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి. అలా ఉంటేనే మంచిదని సూచించారు. ఎందుకంటే మన వైబ్స్‌ మన జీవితాన్నే మార్చేస్తాయి. మన చుట్టూ తప్పకుండా ఎవ్వరికీ కనిపించని ఒక గ్లో ఉంటుందని, దాన్నే వైబ్‌ అంటారని తెలిపారు. నెగిటివ్‌ మైండ్‌ పెట్టుకుని పాజిటివ్‌ లైఫ్‌ కావాలంటే కుదరదు. మనమే కాదు మన ఇంట్లో పాజిటివ్‌ వైబ్స్‌ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మన వైబ్స్‌ బాగోకపోతే కుక్కలు కూడా కరుస్తారు అని పూరీ వివరించారు..
    అలాగే గతంలోనూ కష్టాలను గుర్తించి, వాటిని ఎదుర్కోడానికి ధైర్యం కావాలని వివరించారు. జీవితమన్నాక ప్రతి ఒక్కరూ కష్టాలు ఎదుర్కొంటారని.. కష్టాల్లేని వ్యక్తి ఈ భూమ్మీద ఉండరని అన్నారు. ఎలాంటి బాధ వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని.. దాని నుంచి ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకోవాలని తెలిపారు. అలాగే గతాన్ని తలుచుకుని ఏడ్చేవాళ్లు ఎంతోమంది ఉన్నారని.. అలా గతాన్ని తలుచుకుని బాధ పడటం వల్ల ఏమీ రాదని, వాటిని ఎదిరించినప్పుడే ఏదైనా సాధించగలమని తెలిపారు.
     ప్రస్తుతం పూరీ విజయదేవరకొండతో లైగర్‌ చిత్రాన్ని చేస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 9న విడుదల చేయనున్నారు. దీని తర్వాత జనగణ మన, ఆటోజానీ చిత్రాలు నిర్మించనున్నారని సమాచారం.