న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో కేరళ సిఎం పినరయి విజయన్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలని కోరిన విజయన్, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన రూ.4,500 కోట్ల మేర జిఎస్‌టి బకాయిలను తక్షణం చెల్లించాలని కోరారు. రైలు ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు మోడీ, విజయన్ సమావేశంలో చర్చకు వచ్చాయి. భేటీ అనంతరం విజయన్ మీడియాతో మాట్లాడుతూ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన రూ.4,524 కోట్లు ఇవ్వాలని మోడీని కోరానన్నారు. ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయని, రాష్ట్రానికి తక్షణం సాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏడాదికేడాదికి పెరుగుతున్న జిఎస్‌టి బకాయిలపై ప్రధాని వద్ద ప్రస్తావించానని పేర్కొన్నారు. అదేవిధంగా కేరళలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉందని, దీనిపై ప్రధానిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని విజయన్ వెల్లడించారు. ప్రధానితో భేటీ అనంతరం విజయన్ కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరితో పాటు రైల్వే, ఐటి శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లను కలిశారు. కేరళలో సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ అధికారంలోకి తిరిగి వచ్చిన తర్వాత విజయన్ ఢిల్లీ పర్యటనకు రావడం ఇదే తొలిసారి.










