Nov 06,2023 23:07

ప్రజాశక్తి-కాకినాడ జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్‌ కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా, జెసి ఎస్‌.ఇలక్కియ, డిఆర్‌ఒ కె.శ్రీధర్‌ రెడ్డి, జెడ్‌పి సిఇఒ ఎ.రమణారెడ్డి, బిసి కార్పొరేషన్‌ ఇడి ఎ.శ్రీనివాసరావు, డిఎల్‌డిఒ పి.నారాయణ మూర్తితో కలిసి హాజరై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. ఈ అర్జీలను సత్వరం పరిష్కారించాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు కలెక్టర్‌ కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భూ వివాదాలకు సంబంధించి మొత్తం 333 అర్జీలు వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు. ప్రతి వినతినీ క్షుణ్నంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని సూచించారు.
ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమంగా ఉన్న స్పందన, డయల్‌ యువర్‌ కమిషనర్‌లో వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తునూ సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ సిహెచ్‌.నాగ నరసింహారావు అధికారులను ఆదేశించారు. స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పది మంది పలు సమస్యలను ఫోన్‌ ద్వారా కమిషనర్‌కు వివరించారు. ఇంజనీరింగ్‌, పారిశుధ్యం, గృహ నిర్మాణం, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్‌ఇ పి.సత్య కుమారి, డిప్యూటీ కమిషనర్‌ కోన శ్రీనివాస్‌, ఎంహెచ్‌ఒ డాక్టర్‌ పథ్వీచరణ్‌, మేనేజర్‌ కర్రి సత్యనారాయణ, ఎసిపి నాగశాస్త్రులు, ఇఇ వెంకట్రావు, మాధవి, టిపిఆర్‌ఒ మానే కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.