Apr 08,2023 21:22

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి

'జగనన్నే మా భవిష్యత్తు' విజయవంతానికి కృషి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్భన్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆదేశాలతో 20 రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరులోని మేకపాటి కార్యాలయంలో పట్టణ పార్టీ నాయకులు, కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు వారికి కేటాయించిన గృహాలకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు.
ప్రజా మద్దతు పుస్తకం ద్వారా ప్రజల నుండి గత పాలన కంటే ప్రస్తుత మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో సంక్షేమం, అభివృద్ధి ఎలా జరిగిందనే వివరాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుతం జగనన్న పాలనలో వారి కుటుంబాలకు మంచి జరిగిందా లేదా, ప్రతి కుటుంబానికి పింఛన్‌, అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి పథకాలను నేరుగా అకౌంట్లలో జమ చేయడంపై స్పందన, సంక్షేమ అభివృద్ధి పథకాలను కొనసాగించాలా వద్దా, జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి నమ్మకం ఉంచి మద్దత ఇస్తారా అనే అంశాలను తప్పకుండా తెలుసుకోవాలన్నారు. 20రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల మద్దతు ఎలా ఉందో తుది నివేదికలను తెలియచేయాలని, అందరూ సమిష్టి భాగస్వామ్యంతో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరమణమ్మ, వైస్‌ చైర్మన్‌ షేక్‌ సర్దార్‌, వైసిపి పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనందరెడ్డి, మాజీ జెడ్‌పిటిసి డాక్టర్‌ సిహెచ్‌ ఆదిశేషయ్య ఎస్‌సిసెల్‌ అధ్యక్షులు కొండా వెంకటేశ్వర్లు, నోటి వినరుకుమార్‌ రెడ్డి, సయ్యద్‌ జమీర్‌, వెండి రమణయ్య తదితరులున్నారు.