- కలెక్టర్ డిల్లీరావు ఆదేశం
ప్రజాశక్తి - విజయవాడ : ప్రత్యేక డ్రైవ్ ద్వారా నగరవీధుల్లో చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న పేదలను గుర్తించి జగనన్న తోడు పథకాన్ని అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమీపంలోని మ్యూజియం రోడ్డు స్వరాజ్య మైదాన ప్రాంతంలో చిరువ్యాపారులను కలిసి జగనన్న తోడు పథకం గురించి ఆరా తీశారు. మ్యూజియం రోడ్డులో పలువురు వ్యాపారులతో మాట్లాడిన ఆయన జగనన్న తోడు అమలుపై విస్మయం వ్యక్తం చేశారు. పథకం అమలులో అధికారుల అలసత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 10 మంది చిరువ్యాపారులను జగనన్న తోడు పథకం గురించి అడిగితే వారిలో 9 మంది అసలు ఈ పథకం ఉన్న సంగతే తమకు తెలియదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే వాస్తవాలు తెలుస్తాయన్నారు. తక్షణమే ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వీధి వ్యాపారుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 1300 మందికి జగనన్న తోడు పథకం కింద ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. విజయవాడలో 2 వేల మందికిపైగా పలు వీధి వ్యాపారాలు చేస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో నగరపాలక సంస్థ యుజిడి ప్రాజెక్టు ఆఫీసర్ కె.శకుంతల, ఎల్‌డివో జగదిశ్వరీ, లైవ్‌వుడ్ స్పెషలిస్ట్ రమ్యకృష్ణ, తహాశీల్దార్ వెన్నెల శ్రీను, 98 సచివాలయ సిబ్బంది సయ్యద్ హసన్, బి దుర్గాబాయి పాల్గొన్నారు.










