ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : జగనన్న తోడు పథకం క్రింద సత్యసాయి జిల్లాలో 11,634 మందికి రూ.11.63 కోట్లు లబ్ధి చేకూరిందని సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ తెలిపారు. బుధవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి చిరు వ్యాపారులకు, వత్తిదారులకు ఆరవ విడత లో ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయంతో పాటు గతంలో రుణాలు పొందిన వారికి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ తో పాటు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఓబుళపతి, కూడా చైర్‌పర్సన్ లక్ష్మీ నరసమ్మ, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని 32 మండలాల్లో 10,240 మందికి రూ. 10.24 కోట్లు, మున్సిపాలిటీ పరిధిలో 1,394 మందికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో లబ్ధిదారులకు పంపిణీ జరిగిందన్నారు. ఈ సందర్భంగా వడ్డీ రాయితీ క్రింద మంజూరైన మెగా చెక్కును కలెక్టరు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా జిల్లా అధ్యక్షురాలు సాయి లీల, పట్టణ ఇన్‌ఛార్జి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.










