Oct 11,2022 22:09

ప్రజాశక్తి-గంపలగూడెం
జగనన్న శాశ్వత భూహక్కు సమగ్ర రీసర్వేలో వ్యత్యాసాలు ఉంటే తెలియజేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీ రావు కోరారు. గత ఆరు నెలలుగా రాజవరం గ్రామంలో కొనసాగుతున్న జగనన్న శాశ్వత భూహక్కు సమగ్ర రీసర్వే ఇటీవల పూర్తయిందని స్థానిక రాజవరం రెవెన్యూ అధికారులు కలెక్టర్కు నివేదిక అందించారు.ఈ విషయమై జరిగిన సర్వేను పరిశీలించేందుకు కలెక్టర్‌ మంగళవారం మండలంలోని రాజవరం గ్రామానికి విచ్చేశారు. మొదటగా ఆయన ఎంపీయుపి పాఠశాల విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. పలు తెలుగు, ఆంగ్ల పదాలు, లెక్కలు చేయు విధానంపై ఆరా తీయగా విద్యార్థులు తగిన స్థాయిలో స్పందించి జవాబులు ఇచ్చారు. దీనితో కలెక్టర్‌ విద్యార్థులను, సిబ్బందిని అభినందించారు. అనంతరం ఆ గ్రామ సర్పంచ్‌ చిన్నుపాటి నరసింహారావు అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామంలో 812 ఎకరాల 96 సెంట్లు రీసర్వే చేసినట్లు తెలిపారు. అత్యాధునిక సాధనాలతో ఈ సర్వే నిర్వహించడం జరిగిందని, డ్రోన్‌ కెమెరాల ద్వారా ఛాయాచిత్రాలు తీసి వాటి ప్రతులను రైతులకు అందజేశారు. అందులో ఆధార్‌, ఫోన్‌,సర్వే తదితర నెంబర్లలో ఎటువంటి వ్యత్యాసం ఉన్న వెంటనే రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని వివరించారు. కార్యక్రమంలో పిఎసిఎస్‌ అధ్యక్షులు చెన్నుపాటి శేషగిరిరావు,ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, జడ్పిటిసి శామ్యూల్‌, తాసిల్దార్‌ జి. బాలకష్ణారెడ్డి మరియు సచివాలయ సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.