ప్రజాశక్తి-రాయచోటి : జగనన్న కాలనీలలో అన్ని శాఖలు సమన్వయంగా పనిచేసి మౌలిక వసతులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుంచి జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాల ప్రగతిపై హౌసింగ్, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, డ్వామా, ఎంపిడిఒలు, మండల ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి గృహ నిర్మాణాల పూర్తికి చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తాను కొన్ని హౌసింగ్ లేఅవుట్లను స్వయంగా సందర్శించినప్పుడు తన దృష్టికి కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడినట్లు తెలుస్తోందన్నారు. పేదవారికి ఒక గూడు కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న లేఅవుట్ కాలనీలలో వంద శాతం మౌలిక వసతులు కల్పించడం అధికారుల బాధ్యతన్నారు. కురబలకోట మండలం బ్రాహ్మణ వడ్డేపల్లి, కంటేవారిపల్లి లేఔట్లలో విద్యుత్ స్తంభాలు ఆరడుగుల లోతు పాతాల్సి ఉండగా, మూడు అడుగులలో మాత్రమే నాటారన్నారు. కనెక్షన్ ఇచ్చిన తర్వాత పోల్ పడిపోతే ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. పోల్స్ నాటేటప్పుడు ఖచ్చితంగా మార్గదర్శకాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మే నెలాఖరులోగా అన్నిచోట్ల విద్యుత్ లైన్ల కనెక్షన్లు పూర్తి చేయాలన్నారు. కాలనీలలో నీటి వసతికి సంబంధించి బోరు, ట్యాంకు, కుళాయి కనెక్షన్ రోడ్డుపక్కగా ఉండాలన్నారు. జగనన్న ఆర్చ్ నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఇంకా అకౌంట్లు జనరేట్ చేయనివి 145 ఉన్నాయని, వాటికి వెంటనే అకౌంట్లు జనరేట్ చేయించాలన్నారు. అకౌంట్ నెంబర్లు లేకుండా ఇంటి స్టేజ్‌లను తదుపరి స్థాయికి ఎలా మంజూరు చేస్తారని గహ నిర్మాణ శాఖ అధికారులను ప్రశ్నించారు. ప్రతివారం స్టేజి వారీగా నిర్మాణాలలో ప్రగతి ఉండాలని తెలిపారు. టెలి కాన్ఫరెన్స్‌లో హౌసింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, పంచాయతీరాజ్, డ్వామా తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










