రాయచోటి : నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ గిరిష పిఎస్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ గిరీష పిఎస్ జగనన్న హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలు, ఎస్ డబ్ల్యు పిసి షేడ్స్ నిర్మాణాలు, తదితర అంశాలపై తహశీల్దార్లు, ఎంపిడిఒలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి రోజురోజుకూ పురోగతి కనిపించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో లబ్ధిదారునికి రూ.35 వేలు రుణం ఇప్పించాలన్నారు. ఇందుకు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు సంబంధిత అధికారులతో మాట్లాడి లబ్ధిదారులకు రుణం ఇప్పించే ఏర్పాట్లు చేయాలన్నారు. బిల్లులు పెండింగ్ లేకుండా సకాలంలో మంజూరు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని ప్రతి ఒక్కరూ విధిగా భావించి లేఅవుట్ వారీగా ఇచ్చిన లక్ష్యాలను అధిగమించాలని అధికారులను ఆదేశించారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ దష్టిలో పెట్టుకోని పనిచేయాలన్నారు. హౌసింగ్ రిలేటెడ్ అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జగనన్న హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి అయ్యేటట్లు చూడాలన్నారు. కొన్ని మండలాలలో అనుకున్న స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు జరగడంలేదని, వచ్చే వారం నాటికి ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపించాలని ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతి సాధనలో నిర్లక్ష్యం చేయడం, లక్ష్యంలో వెనుకబడిన అధికారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాకు మొత్తం 501ఎస్ డబ్ల్యు పిసి షెడ్లు మంజూరయ్యాయని, ఇందులో62 షెడ్ల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. ఇవన్నీ వచ్చే వారం నాటికి పిల్లర్ లెవల్‌కు తీసుకురావాలన్నారు. ప్రతి ఎస్ డబ్ల్యూ పిసి షెడ్డు కు రోడ్డు కనెక్టివిటీ, నీటి సౌకర్యం, కల్పించి ప్రతి షెడ్డు కు తప్పకుండా నేమ్ బోర్డు రాయించాలన్నారు. కార్యక్రమంలో డిపిఒ ధనలక్ష్మి, హౌసింగ్ పీడీ శివయ్య, పంచాయతీరాజ్ ఎస్‌ఇ సురేష్ కుమార్ పాల్గొన్నారు.










