జగనన్న గృహాలను పూర్తి చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : జిల్లాలో జగనన్న గృహాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా హౌసింగ్ పీడీ నరసింహం పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక స్త్రీ శక్తి భవన్‌లో సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా పేదలకు గృహాలు నిర్మిస్తుందని అందులో భాగంగా జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు 86 వేల 241 గృహాలను అందించుతుందన్నారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ జిల్లాలోని లేఅవుట్లకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎలక్ట్రికల్ ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. విద్యుత్ నీటి సదుపాయం కల్పిస్తారని ప్రతిఒక్కరూ బాధ్యతగా ఇల్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులను కోరారు. కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్లు శ్మశానాలకు దగ్గరగా ఉండడంతో 13 వేల 124 మంది ఇంకా గృహ నిర్మాణాలు ప్రారంభించలేదన్నారు. వీరికి అవగాహన కల్పించి త్వరలో నిర్మాణాలు ప్రారంభించేలా అవగాహన కల్పిస్తామన్నారు. పునాదుల నిర్మించుకొని లబ్ధిదారులు ఉచితంగా ఇసుక పొందవచ్చన్నారు. జిల్లాలో 34 వేల 482 గృహాలు పునాదుల స్థాయిలో ఉన్నాయని బేస్‌మట్టం స్థాయిలో 19850 రూ ఫ్లేవర్ లో 3138 స్లాబులు 3170 పోసారని తెలిపారు. 8400 గృహాలు పూర్తయ్యాయని లబ్ధిదారులు గృహ ప్రవేశం కూడా చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక ఇంటికి రూ.1,80,000 మంజూరు చేయడమే కాకుండా 0 వడ్డీతో ప్రభుత్వం మరో రూ.35000 లోను ఇస్తుందని, మున్సిపాలిటీ ప్రాంతాల్లో రూ.35000 లోను మంజూరు చేస్తున్నారు. మే, జూన్, జూలైలో ఇల్లు నిర్మించుకునేందుకు అనుకూల వాతావరణం ఉంటుందన్నారు. అనంతరం శకునాలపల్లి సచివాలయం రికార్డులను పరిశీలించి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ పి.ఐజాక్ ప్రవీణ్, హౌసింగ్ ఏఈ రామకృష్ణ, వర్క్ ఇన్‌స్పెక్టర్లు హర్షవర్ధన్, చిన్నరాయుడు, సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.










