Jan 28,2023 21:03

వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

        ప్రజాశక్తి-చిలమత్తూరు    జగనన్న చేదోడు పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మరో 10 రోజులు గడువు పెంచాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో శనివారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో ఎఎస్‌ఒ భారతి, విఆర్‌ఒ ప్రవీణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఫిరంగి ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జగనన్న చేదోడు పథకానికి అనేక ఆంక్షలు పెట్టి 27వ తేదీతో గడువు ముగించడంతో అనేక మంది లబ్ధిదారులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా అర్హులుగా ఉన్న రజకులు, దర్జీలు, కులవృత్తులు చేస్తున్న నాయీ బ్రాహ్మణులందరూ వారి పని ప్రదేశాల్లో తమ వృత్తులు చేసుకుంటూ బతుకుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులే గడువు ఇచ్చి కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను నిర్ణీత సమయంలో సచివాలయాల్లో అందజేయాలని సూచించారన్నారు. అయితే గడువులోగా ఆయా ధ్రువీకరణ పత్రాలు పొందలేక మండలంలో వందలాదిమంది పథకానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే మరో 10 రోజులు సమయాన్ని పొడిగించి అర్హులందరికీ పథకం అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు లక్ష్మీనారాయణ, రామచంద్ర, అనంద్‌, నారాయణప్ప, ధర్మేంద్ర, తదితరులు పాల్గొన్నారు.