ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగాన్ని విస్మరించి జగన్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తోందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు పేర్కొన్నారు. గురువారం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులపై తాను విమర్శలు చేసి కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేసి వీడియో ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రచారం చేయాల్సింది వివేకానందరెడ్డి హత్య కేసులో గొడ్డలి వేటును గుండెపోటుగా చిత్రీకరించడం, బాధితులపైనే కేసులు బనాయించి బాధ్యులను చేయడం వంటి వాటిని ప్రచారం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులు 95 శాతం నిజాయితీగా ఉన్నారని తెలిపారు. మిగిలిన వారు రాష్ట్ర ప్రభుత్వానికి గులాములుగా వ్యవహరిస్తూ అధికార పార్టీ నేతలకు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. టిడిపి గుత్తితో గెలిచి వైసిపితో కలిసి పనిచేస్తున్న వంశీ గన్నవరంలోని టిడిపి పార్టీ కార్యాలయంపై అనుచరులతో కలిసి దాడి చేసి కార్లు ధ్వంసం చేసి కార్యకర్తలను చితకబాదినా పోలీసులు అడ్డుకోలేకపోయారని, వారికే వత్తాసు పలుకుతూ సహకరించారని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో అధోగతి పాలైన రాష్ట్ర స్థితిగతులను మార్చడానికి ప్రజల కోసం ఈ వయసులో చంద్రబాబు నాయుడు పర్యటనలు చేస్తే సహించలేక అడుగడుగునా పోలీసు బలగాలతో అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. లోకేష్ బాబు చేస్తున్న యువగళం పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి జగన్‌రెడ్డికి దిక్కుతోచక ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. కేసులకు, రిమాండ్లకు భయపడేది లేదని.. రానున్నది టిడిపి ప్రభుత్వమేనని 24 శాతం వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు డాక్టర్ సుధాకర్, మండల అధ్యక్షులు సుబ్బ నరసయ్య నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, మైనారిటీ నాయకులు అబూబకర్ పాల్గొన్నారు.










