జగన్ ప్రభుత్వంలో దళితులపై దాడులు
ప్రజాశక్తి-అల్లూరు : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో దళితులపై దాడులు నానాటికి పెచ్చుమీరు పోతున్నాయని టిడిపికి చెందిన పలువురు దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలు, దాడులు అధికమయ్యాయ వివరించారు. కావలి నియోజకవర్గంలో గూండాయిజం నడుస్తుందని అందుకు ఉదాహరణ అధికార పార్టీ నేతల దౌర్జన్యకాండతో ముసునూరు గ్రామానికి చెందిన దుగ్గిరాల కరుణాకర్ మృతి చెందడం జరిగిందన్నారు. అలాగే కడనూతల గ్రామానికి చెందిన పైడి హర్ష చెన్నరులో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ఇటీవల దగదర్తి మండలం ఉలవపాళ్ల పెట్రోల్ బంకు వద్ద రూ.30 వేలకు డీజల్ పట్టనందుకు గోచిపాతల తేజ అనే యువకుడిపై ఎంపిటిసి మహేష్ నాయుడు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. దళితులపై జరిగే అన్యాయాలపై శాంతియుతంగా నిరసన తెలుపుకునేందుకు చలోకావలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పోలీసులు జిఒ నెంబర్ 1 ప్రకారం నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను జగన్ హరించి వేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి దళితులు తీవ్రంగా మోసపోయారని తెలియజేశారు. హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వానికి త్వరలో గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఇకనైనా దళితులు మేల్కొని ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. దళితులపై నిత్యం దాడులు జరుగుతుంటే పోలీస్ అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. రాజకీయ నేతల ప్రలోభాలకు లొంగి పోలీసులు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదని నియంతత్వ పాలన అంటూ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో చెంతాటి రాజశేఖర్ బాబు, అరగల రమణయ్య, కావలి జగన్‌మోహన్‌రావు, శీనయ్య, వెంకయ్య తదితరులున్నారు.










