Dec 25,2022 19:35

సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ ఎన్‌.తులసిరెడ్డి

- పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి
ప్రజాశక్తి - రాయచోటి : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పాలనపై పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి మండిపడ్డారు. 'జగన్‌ పాలనలో నాడు ముద్దులు..నేడు గుద్దులు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు అవ్వ తాతల తలరాతలు మారుస్తానని చెప్పి ఇప్పుడు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఆదివారం పట్టణంలోని స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్‌.అల్లబకాష్‌తో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రూ.3 వేలు పింఛన్‌ ఇస్తానని చెప్పడంతో అవ్వతాతల నమ్మ ఓట్లు వేసి గెలిపించాకా, అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా రూ.2500 ఇస్తున్నారున్నారు. అంతటితో ఆగకుండా రకరకాల షరతలతో 4 లక్షల మందిని వృద్ధులు, వితంతువులు, విభిన్నప్రతిభావంతులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు తీసేసారన్నారు. ఇంటికి ఒక మహిళకు పింఛను సౌకర్యం అనే నినాదంతో అనేక కుంటుంబాలలో చిచ్చు పెడుతున్నారున్నారు. ఒక ఇంటిలో అత్త వయస్సు 70 ఏళ్లు, కోడలు వితంతువు ఉంటారని, వారి మధ్య చిచ్చులు పెడుతున్నారుని విమర్శించారు. ఇంటికి ఒక్కరికీ అనే షరతును తొలగిచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌ మోహన్‌రెడ్డికి 175 అసెంబ్లీ స్థానాలు కాదని కేవలం 13 స్థానాలు వస్తేనే గొప్ప విషయమని జోస్యం చెప్పారు. చిన్నాన కూతురు సునీత, సొంత చెల్లెలు షర్మిలకు న్యాయం చేయలేని నీవు రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తావని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు, రైతు కూలీలు, భవన కార్మికులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ వర్గాలను మోసం చేశాడన్నారు. వచ్చే ఎన్నికలల్లో జగన్‌ తల కింద పెట్టి తలకిందులు చేసినా అధికారంలోకి రాలేడని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఎపిసిసి డెలిగేట్‌ ఎస్‌ఎండి.మహమ్మద్‌ గౌస్‌, రాష్ట్ర మైనారిటీ వైస్‌ చైర్మన్‌ మహమ్మద్‌ రఫీ, కిసాన్‌ జిల్లా అధ్యక్షులు చెన్నకృష్ణ, పిసిసి ఆర్గనైటెడ్‌ ఆర్గనైజర్‌ సెక్రెటరీ మహబూబ్‌ బాషా, ఖదీర్‌, రమణమ్మ, నాగలత, నాగయ్య, మహబూబ్‌ జాన్‌, రాందాస్‌, ఉత్తన్న పాల్గొన్నారు.