అనంతపురం : గత రెండున్నరేళ్లలో రాయలసీమకు సిఎం జగన్ చేసిందేమీ లేదని, జగన్ అసమర్థత వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా నెమ్మదించిందని మాజీ మంత్రి, టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని రకాలుగా విఫలమైన జగన్ తమ అధినేత చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందని, ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని చంద్రబాబు అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. సిఎంగా ప్రమాణం చేయకముందే తెలంగాణలోని పోలవరం ముంపు మండలాలు ఎపిలో కలిసేలా చంద్రబాబు కృషి చేశారని, ఆయన వల్ల పోలవరం పనులు సాఫీగా కొనసాగాయని అన్నారు. అయితే, జగన్ తన అసమర్థత వల్ల పోలవరం పనులను పూర్తి చేయలేకపోతున్నారని విమర్శించారు. జగన్ సిఎంగా ఉన్నంత కాలం గ్రావిటీ ద్వారా పోలవరం నీటిని తరలించే అవకాశమే లేదని అన్నారు. టిడిపి ఐదేళ్ల పాలనలో హంద్రీనీవా కోసం రూ.8 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని, జగన్ సిఎం అయ్యాక ఎంత ఖర్చు పెట్టారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. కెసిఆర్‌తో కుదుర్చుకున్న రహస్య ఒప్పందంతో రాయలసీమ ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని విమర్శించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జల వివాదాల పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.










