జెవివి ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవం
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణ జనవిజ్ఞాన వేదిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రెడ్‌క్రాస్ భవనంలో ఘనంగా సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఫిబ్రవరి 13వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ పోటీలు- వారోత్సవాలు, మంగళవారం 28వ తేదీ చివరగా సైన్స్ దినోత్సవం నాడు విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన, వివిధ పోటీలలో 30 పాఠశాలల నుండి 150మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ, బహుమతులతోపాటు, రెండు ప్రత్యేక పార్టిసిపేషన్ బహుమతులను ప్రతి పోటీకి అందజేశారు. వైజ్ఞానిక ప్రదర్శనలను, వర్కింగ్ మోడల్స్‌గా తయారుచేసి తీసుకొచ్చి విద్యార్థుల్లో దాగియున్న సృజనాత్మక శక్తి బయటపడి, జనవిజ్ఞాన వేదిక ఆశయం ప్రకారం భావి శాస్త్రవేత్తలు దేశానికి తయారై వస్తున్నట్లు అనిపించిందని జనవిజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు డాక్టర్ బి.రవికుమార్, అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు, ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక బాధ్యులు సి.కల్లయ్య, జి.కల్యాణి, సి.శారద, కోటేశ్వరరావు, జాన్, షేక్ రఫి, జానకిరామ్, ఖాదర్ బాషా, తదితరులు విధులు నిర్వహించారు. న్యాయనిర్ణేతలుగా, డాక్టర్ రేవంత్, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ వెంకటేశ్వర్లు, పి.భారతి వ్యవహరించారు. వారికి జనవిజ్ఞానవేదిక కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి, కావలి రెడ్‌క్రాస్ భవనంలో జాతీయసైన్స్ దినోత్సవ, కార్యక్రమంలో, వక్తల ప్రసంగం, వివిధ అంశాలలో, గెలుపొందిన విజేతలకు, బహుమతి ప్రదానం చేశారు. ముఖ్యఅతిథిగా జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల రాము, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కామంచి సుబ్బారావు మాట్లాడుతూ భావితరం శాస్త్రవేత్తలను తయారు చేయడంలో జనవిజ్ఞానవేదిక సత్సంకల్పంతో చేస్తున్న ప్రయత్నాలు తప్పక నెరవేరుతాయన్నారు. గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికుమార్, సెక్రెటరీ గాదిశెట్టి.హరనాధ్, ఉపాధ్యక్షులు జానకిరామ్, జాయింట్ సెక్రెటరీ ఖాదర్ బాషా ప్రధాన వక్తలుగా పాల్గొన్నారు. ముందుగా శాస్త్రవేత్తలు విచిత్రవేషధారణ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా గణపతిరాజు.మారుతీరావు, ఎమ్.చంద్రశేఖర్ వ్యవహరించారు. సభానంతరం పోటీల విజేతలకు బహుమతులుగా మొమెంటోలు, జనవిజ్ఞాన వేదిక ప్రచురిత విజ్ఞాన పుస్తకాలు, అందరకూ ప్రశంసాపత్రాలను అందజేశారు. పోటీలలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ప్రతిఒక్కరికీ మెమెంటోలను ఇచ్చి సత్కరించారు.










