Nov 14,2022 23:39

  • ఎన్‌టిఆర్‌ జిల్లా డిఆర్‌ఒ కె.మోహన్‌ కుమార్‌
  • బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ పుస్తక ప్రదర్శన ప్రారంభం

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : జాతీయోద్యమానికి ఊపిరినిచ్చింది గ్రంథాలయోద్యమమేనని ఎన్‌టిఆర్‌ జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌ కుమార్‌ అన్నారు. గ్రంథాలయోద్యమం ఎంతో మందికి విజ్ఞానాన్ని, భవిష్యత్తును అందించిందన్నారు. జాతీయ పుస్తక వారోత్సవాల సందర్భంగా విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఆధ్వర్యాన గవర్నరుపేటలోని విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ భవనం ఆవరణలో ఏర్పాటుచేసిన పుస్తక ప్రదర్శనను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మోహన్‌ కుమార్‌ మాట్లాడుతూ గ్రంథాలయోద్యమంతో పెద్దఎత్తున గ్రంథాలయాలను ఏర్పాటుచేశారని అన్నారు. దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాలు పటిష్టంగా ఉన్నాయంటే ఆనాడు నెహ్రూ రూపొందించిన విధానాలే కారణమన్నారు. ఆధునిక భారతదేశం రూపకల్పనకు దిశానిర్దేశం చేశారని కొనియాడారు. విద్యార్థి దశ నుండే పుస్తకాలపై ఆసక్తి పెంచుకుంటే భవిష్యత్తులో విజ్ఞానవంతులు కాగలరని, ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుందని అన్నారున. పుస్తకాలు చదవడం వల్ల పిల్లల్లో ప్రశ్నించేతత్వం పెరుగుతుందన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవానికి దేశవ్యాప్తంగా మంచి పేరు, గుర్తింపు ఉన్నాయన్నారు. జనవరి అంటే విజయవాడలో పుస్తకాల పండుగ గుర్తుకు వస్తుందన్నారు. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఉపాధ్యక్షులు జి.లక్ష్మీ మాట్లాడుతూ విజయవాడ పుస్తక మహోత్సవ్‌ ఆధ్వర్యాన ప్రతి ఏటా జనవరిలో పుస్తక మహోత్సవ్‌ను పెద్దఎత్తున నిర్వహించడంతో పాటు జాతీయ పుస్తక వారోత్సవాల సందర్భంగా కూడా పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ గౌరవాధ్యక్షులు బి.బాబ్జి, సభ్యులు వెంకట నారాయణ పాల్గొన్నారు. తొలుత విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ కార్యదర్శి కె.లక్ష్మయ్య వేదికపైకి అతిధులను ఆహ్వానించారు. పలువురు నగర ప్రముఖులు, పుస్తక ప్రచురణ కర్తలు పాల్గొన్నారు.