పీలేరు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానం- 2020ని రద్దు చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు హరి ప్రసాద్, జాబీర్ డిమాండ్ చేశారు. యుటీఎఫ్ బేరర్ల సమావేశం ఆదివారం శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ రాష్ట్రంలో ప్రతి అంశం కేంద్రీకరణ, వ్యాపారీకరణ, మత తత్వీకరణ లక్ష్యంగానే జరుగుతున్నాయని అన్నారు. ప్రతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వ విపరీత జోక్యం వల్ల సమాఖ్య స్ఫూర్తి, రాష్ట్రాల హక్కులు హరించబడతాయన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. పాఠశాలల విలీనం పేరుతో పాఠశాల విద్యను, విదేశీ విశ్వ విద్యాలయాల ప్రాంగణాల పేరుతో ఉన్నత విద్యను, సెల్ఫ్ ఫండింగ్ పేరుతో సాంకేతిక, వత్తి విద్యలను ప్రభుత్వ రంగంలో నిర్వీర్యంచేసి కార్పొరేట్లకు అధిక లాభాలు చేకూర్చే సాధ నంగా ఎన్‌ఐపి-2020 ఉందని చెప్పారు. దీన్ని తక్షణమే రద్దు చేసి రాజ్యాంగ విలువలతో కూడిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. పాఠశాల పర్యవేక్షణ ఉపాధ్యా యులను ఒత్తిడికి గురి చేసే విధంగా కాకుండా, విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధించేందుకు సహకరించేదిగా ఉండాలని, ఉపాధ్యాయులను బోధ నేతర కార్యక్రమాల నుంచి మినహాయించాలని, ప్రభుత్వ పాఠశాల వ్యవ స్థను బలోపేతం చేయాలని కోరారు. సిపిఎస్ రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగుల కు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావలసిన ఆర్థిక బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలని, పెండింగులో ఉన్న డిఎలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, గిరిజన సంక్షేమ, ఎయిడెడ్, మున్సిపల్, మోడల్ స్కూళ్ళు, కెజిబివి పాఠశాలల్లోని ఉపాధ్యాయుల, సిఆర్‌ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో యుటియఫ్ జిల్లా సహాధ్యక్షులు శివారెడ్డి, కోశాధికారి బి.చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శులు సుధాకర్ నాయుడు, పురం వెంకటరమణ, సివి రమణ మూర్తి, భాస్కర్ రెడ్డి, సురేంద్ర రెడ్డి, అక్రం బాష ఉపాధ్యాయ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.యుటిఎఫ్ బేరర్ల సమావేశంలో పాల్గొన్న నాయకులు










