Feb 15,2023 21:25

సంబేపల్లె హైస్కూల్‌ను సందర్శిస్తున్న కేంద్ర బృందం

రాయచోటి : అత్యంత ప్రతిష్టాత్మకమైన 4వ జాతీయ జల అవార్డు (నేషనల్‌ వాటర్‌ అవార్డ్స్‌) రేసులో సంబేపల్లి హైస్కూల్‌ ఉంది. ప్రతి సంవత్సరమూ దేశవ్యాప్తంగా జలసంరక్షణలో ఉత్తమ విధానాలు ప్రదర్శించే మూడు పాఠశాలలకు కేంద్ర జల మంత్రిత్వశాఖ జాతీయ జల అవార్డును ఇస్తుంది. ఇందులో భాగంగా సంబేపల్లి పాఠశాల గత సంవత్సరం అక్టోబర్‌లో నామినేట్‌ అయింది. ఇందులో భాగంగా హైస్కూల్‌ను బుధవారం కేంద్ర బృందం సందర్శించింది. బృందంలో సెంట్రల్‌ వాటర్‌ కమిషనర్‌ సభ్యులతోపాటు నేషనల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డు సభ్యులున్నారు. బృందానికి నేతృత్వం వహించిన సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నందిని, జ్ఞానేశ్వర్‌రావు మాట్లాడుతూ జల సంరక్షణ కోసం పాఠశాలలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించామన్నారు. వాన నీటిని భూమిలోకి ఇంకించేందుకు పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతను పరిశీలించామని తెలిపారు. ఉపాధి హామీ ఆధ్వర్యంలో నాటిని 3 వేల మొక్కలను వాటి సంరక్షణ కోసం తీసుకున్న చర్యలు, తక్కువ నీటి సరఫరా కోసం అమర్చిన డ్రిప్‌ పైపులను పరిశీలించినట్లు చెప్పారు. తక్కువ నీటిని గ్రహించే మొక్కలు పాఠశాలలో ఉండడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సభ్యులు అనంతరావు, హెచ్‌ఎం మడితాటి నరసింహారెడ్డి, జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ మార్ల ఓబుల్‌ రెడ్డి, విశ్రాంత ఎంఇఒ రామిరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.