Feb 20,2022 07:51
  • వేల ఎకరాల్లో సీడ్‌ ఫెయిల్‌
  • పరిహారం ఎగవేతకు కంపెనీ యత్నాలు
  • పత్తి రైతు గగ్గోలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : నకిలీ, కల్తీ పత్తి విత్తనాలు అంటగట్టి రైతులను నట్టేట ముంచిన కావేరి కంపెనీపై ప్రభుత్వం వల్లమాలిన జాలి చూపిస్తోందని విమర్శలొస్తున్నాయి. మొన్న ఖరీఫ్‌లో కావేరి కంపెనీ 'జాదు' పేరిట విక్రయించిన బోల్‌గార్డ్‌-2 పత్తి విత్తనాలు చాలా చోట్ల వేల ఎకరాల్లో విఫలమయ్యాయి. సదరు విత్తనాలు వేసిన రైతులు భారీ పంట నష్టాలను చవి చూశారు. పలు ప్రాంతాల్లో గుంటూరు లాం ఫాం, నంద్యాల విత్తన పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు సీడ్స్‌లో కల్తీ జరిగిందని, అందుకే పంట నష్టం వాటిల్లిందని ధ్రువీకరించారు. ఎపి కాటన్‌ సీడ్‌ యాక్ట్‌-2007ను ప్రయోగించి కావేరి కంపెనీపై కఠిన చర్యలతో పాటు పంట నష్టపోయిన రైతులకు న్యాయమైన పరిహారం ఇప్పించే అవకాశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, ఎందుకనో జంకుతోందని ఆరోపణలొస్తున్నాయి. సీడ్‌ యాక్ట్‌తో సర్కారుకు శక్తిమంతమైన అధికారాలు దఖలు పడినప్పటికీ వాటిని ఉపయోగించట్లేదని సమాచారం. సాంకేతిక కారణాలు చూపించి పరిహారం ఎగ్గొట్టేందుకు కావేరి చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.
 

                                                        కమిటీ అవార్డ్‌ గాలికి

విత్తనాల్లో కల్తీ వల్లనే పంట పోయిందన్న శాస్త్రవేత్తల నిర్ధారణ దరిమిలా, చట్ట ప్రకారం కర్నూలు వ్యవసాయశాఖ వేసిన కమిటీ, 7,800 ఎకరాల్లో నష్టానికిగాను, ఎకరాకు రూ.23 వేల వంతున కావేరి సంస్థ పరిహారం ఇవ్వాలని డిసెంబర్‌ చివరిలో అవార్డ్‌ చేసింది. నెల రోజులు గడువు విధించింది. ఆ ఆదేశాలను కంపెనీ పట్టించుకోలేదు సరికదా కోర్టుకెళ్లింది. వ్యవసాయశాఖ సకాలంలో స్పందించి ఉంటే కోర్టు వివాదం తలెత్తేది కాదని, ఇప్పటికైనా చట్టం ఇచ్చిన అధికారాలతో కోర్టులో పిటిషన్‌ను డిస్‌మిస్‌ చేయించొచ్చన్నది నిపుణుల మాట. ఒక్క కర్నూలులోనే 'జాదు' బాధిత విస్తీర్ణం 30-40 వేల ఎకరాల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇంకా గుంటూరు, కడప, అనంతపురం తదితర జిల్లాల్లోనూ జాదు విత్తనాలు విఫలమై రైతులు నష్టపోయారని సమాచారం.
 

                                                     ఆర్‌బికెలలో అనుమతి

వ్యవసాయ ఉత్పాదకాల విక్రయాలకు గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)లో కావేరి జాదు విత్తనాల విక్రయాలకు ఖరీఫ్‌లో అనుమతించారని తెలిసింది. ఆర్‌బికెలలో దొరికే విత్తనాల జాబితాలో కొన్ని చోట్ల 'జాదు' కూడా ఉందంటున్నారు. నాణ్యతా పరీక్షలు చేశాకే ఆర్‌బికెలలో విత్తనాలమ్ముతారంటుండగా, ఒక వేళ జాదు విత్తనాలు అమ్మి ఉంటే పరీక్షలు చేశారో లేదో తేలాల్సి ఉంది. ఏ విత్తనాలైనా మార్కెట్‌లో అమ్మాలంటే వ్యవసాయశాఖ తనిఖీలు, ధ్రువీకరణ, అనుమతులు తప్పనిసరి. జాదు కల్తీ విత్తనాలు ఏ విధంగా రైతులకు చేరాయో విచారణ చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా, నకిలీ అని ధ్రువీకరించాక చట్ట ప్రకారం కావేరిపై క్రిమినల్‌ చర్యలు తీసుకొని బ్లాక్‌ లిస్టులో పెట్టాలి. ఆ సంస్థ విత్తనాలన్నింటినీ నిషేధించాలి. ఏ కారణం చేతనో ప్రభుత్వం ఇంత వరకు ఆ పని చేయలేదని ఆరోపణలొస్తున్నాయి.