Mar 12,2023 22:13

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ప్రజాశక్తి-హిందూపురం: జాబ్‌ క్యాలెండర్‌, నిరుద్యోగ భృతి పేరుతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను నిలువున మోసం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అదే విధంగా ఉద్యోగులకు ఐఆర్‌, ఇంక్రిమెంట్‌ ఇవ్వడంతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి కనీసం 1వ తేదీన వేతనాలు సైతం ఇవ్వడం లేదని అన్నారు. ఆదివారం పట్టణంలోని ఐఎంఎ హాల్‌లో వామపక్ష నాయకులతో పాటు ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులతో సమావేశమైన ఆయన సోమవారం జరుగుతున్న శాసన మండలి ఎన్నికలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు పట్టుభద్రులను మోసం చేసిన వైసిపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిఎం జగన్మోహన్‌ రెడ్డి జోక్యం చేసుకొని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కనీస విద్యార్హత లేనిరిక్షా కార్మికులను, తాపీ మేస్త్రీలను ఓటరు జాబితాలో చేర్చి దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లతో పాటు ఓట్లను కొనుకుంటున్నారంటే ఎంతగా దిగజారుతున్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. పట్టభద్రులను, ఉపాధ్యాయులను అధికారులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆఖరికి అభ్యర్థులు మారువేషాల్లో కలెక్టర్‌ ఆఫీసు గోడలు దూకి నామినేషన్‌ వేసే పరిస్థితికి దిగజార్చడం సిగ్గుచేటన్నారు. దొంగ ఓటు వేయడానికి ప్రయత్నస్తే వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పిడిఎఫ్‌ బలపరుస్తున్న అభ్యర్థులు ఉపాధ్యాయ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల అభ్యర్థి పోతుల నాగరాజులకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని, ద్వితీయ ప్రాధాన్యత ఓటును టిడిపి బలపరుస్తున్న అభ్యర్థులకు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్‌ బాబు, సిపిఐ పట్టణ కార్యదరి వినోద్‌ కుమార్‌, ఎస్‌టియు రాష్ట్ర నాయకుడు తిప్పన్న, సిపిఐ తాలూకా సహాయ కార్యదర్శి శివప్ప, ఎఐటియుసి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాబు, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, ఎఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి బిల్లుకుల్లాయప్ప, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : పట్లభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అడ్డదారులు తొక్కుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆదివారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టుభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వయంగా సిఎం దిగి వైసిపి అభ్యర్థులు గెలిచేందుకు దొంగ ఓట్లు ఎక్కించారని ఆరోపించారు. ఓటుకు డబ్బులు పంపిణీ జరిగిందని విమర్శించారు. ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించేందుకు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు,టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి భూమి రెడ్డి రాంగోపాల్‌ రెడ్డి కి రెండవ ప్రాధాన్యత ఓటు వేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు బి.కె. పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని విమర్శించారు. మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టుభద్రులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి కి తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో జాబ్‌ క్యాలెండరు అని మోసం చేశారని విమర్శించారు. మోసపూరిత ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పేందుకు మేధావులు, విద్యావంతులు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హరి, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌, సిపిఐ డివిజన్‌ కార్యదర్శి శ్రీరాములు, యుటిఎఫ్‌, ఎస్‌టియు నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.