Mar 27,2023 21:46

సమస్యను పోలీసులకు వివరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి- పరిగి : జయమంగలి నదిలో ప్రభుత్వం ఇసుక తరలింపునకు టెండర్‌ ద్వారా మంజూరు చేయడంతో నిర్వాహకులు సోమవారం వాహనాలతో ఇసుకను తరలించేందుకు వచ్చారు. దీంతో సిపిఎం, వైసిపి నాయకులు ఇసుక తరలింపును అడ్డుకున్నారు. ప్రభుత్వం ద్వారా మంజూరైన ఇసుకతరలింపు పత్రాలను చింపివేఆరు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూగర్భజలాలు అడుగంటిపోవటంతో ఐదేళ్లుగా తమ మండలంలో తాగేందుకు కూడా నీరు దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. ఇటీవలే పుష్కలంగా వర్షాలు రావడంతో నది పరివాహక ప్రాంతాల్లో నీరు పొంగిపొర్లి కొరత తీరిందన్నారు. ఇలాంటి సమయంలో జయ మంగలి నదిలో ఇసుక రీచ్‌ ఏర్పాటు సరికాదని అన్నారు. ఈ ఆదేశాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే హిటాచి, టిప్పర్‌ వాహనాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పెనుగొండ సిఐ కరుణాకర్‌, ఎస్‌ఐలు నరేంద్ర, నాగ స్వామి, వెంకటరమణ, విజరు కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని నాయకులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. వాస్తవ పరిస్థితిని నాయకులు పోలీసులకు వివరించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నాయకులను, వాహనాలను అక్కడినుంచి పంపించారు.