వినతిపత్రం అందజేస్తున్న రైతులు, నాయకులు
ప్రజాశక్తి- పరిగి : మండల కేంద్రంగా జయ మంగలి నది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను వెంటనే రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పరిగి మండలంలోని పలు పార్టీ నాయకులు బుధవారం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక తవ్వకాలు చేపడితే పరిగి మండలం మరోమారు కరువు మండలంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, రైతు సంఘాల నాయకులతో పాటు సిపిఎం నాగరాజు, వైసిపి ప్రభాకర్, శివశంకర్, గోవిందప్ప, మంజునాథ్ రెడ్డి, బిజెపి బద్రీనాథ్‌తో పాటు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.










