Nov 17,2020 06:37

రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన ఇసుక విధానం కొంత మంది బడా ప్రైవేటు వ్యాపారులు, గుత్త సంస్థల దోపిడీకి ఆస్కారం కల్పించేందుకు ఉద్దేశించినట్లు కనిపిస్తోంది. ఇసుక తవ్వకాలు, రవాణా, విక్రయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్‌ డిపార్టుమెంట్లు, ఖనిజాభివృద్ధి సంస్థలు ముందుకొస్తే తొలి ప్రాధాన్యత వాటికే ఇస్తామని, రాకపోతే ప్రైవేటు వారికి బిడ్ల ప్రాతిపదికన అప్పగిస్తామని సర్కారు చెబుతోంది. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం, మూసేయడం, ఖాయిలా పెట్టడం చేస్తున్న కేంద్ర బిజెపి సర్కారు మన ఇసుకలో జోక్యం చేసుకోవడం అత్యాశే. ఇప్పటి వరకు ఆ పని చేసిన రాష్ట్ర ఏజెన్సీ వల్ల కానందునే మరో కొత్త పాలసీ పురుడు పోసుకుంది. ఏతావాతా ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన సంస్థలు, అస్మదీయులు లాభసాటి ఇసుక వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వైపే పరిణామాలు జరగవచ్చు. అదే జరిగితే వైసిపి హయాంలో ఇసుక వ్యాపారంలో దోపిడీ కేంద్రీకృతం అవుతుంది. టిడిపి హయాంలో డ్వాక్రా గ్రూపుల ముసుగులో ఇసుక మాఫియా స్వైర విహారం చేయగా, ఇప్పుడు రాష్ట్రాన్ని మూడు ప్యాకేజీలుగా విభజించి మూడు బడా ప్రైవేటు సంస్థల హస్తగతం చేస్తారు. టిడిపి నేతలను 'ఇసుకాసురులు'గా తిట్టి పోసిన వైసిపి, నాటి అక్రమాలను అరికడతామంటూ 17 మాసాలుగా చేసిన విన్యాసాలు వక్కాణించిన లక్ష్యం కోసం కాదని, ఇసుక దందాను తామే చేజిక్కించుకునే ఎత్తులని నూతన విధానం చెప్పకనే చెపుతోంది.

గతేడాది వైసిపి అధికారంలోకొచ్చిన రెండు వారాల్లోపు జూన్‌ 12 నుంచి అర్ధాంతరంగా ఇసుకను నిషేధించింది. అప్పటి వరకు జరిగిన ఇసుక అక్రమాలను అరికట్టడం, ప్రభుత్వ ఆదాయానికి పడుతున్న గండిని పూడ్చడం, ప్రజలకు చౌకగా ఇసుకను సరఫరా చేయడం కోసమే బ్యాన్‌ అంది. పక్షం రోజులే నిషేధం అని ప్రకటించినా సెప్టెంబర్‌ 5న కొత్త పాలసీ వచ్చే వరకు నెలల పర్యంతం ఇసుక అందుబాటులో లేక లక్షలాది మంది భవన నిర్మాణ, అనుబంధ కార్మికులు పనుల్లేక ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వ్యాపారాలు కుదేలయ్యాయి. ఎంపిఎండిసి నేతృత్వంలో ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు, మండల కేంద్రాల్లో స్టాక్‌ పాయింట్లు అన్నా ఇసుక కొరత తీరలేదు. రవాణా ఛార్జీలు కాకుండా టన్ను ఇసుక రూ.525గా నిర్ణయించినప్పటికీ, టిడిపి హయాంలో 'ఉచిత' ఇసుక ట్రాక్టర్‌ రూ.1,500-2 వేలు పలకగా, వైసిపి ప్రభుత్వంలో రూ.3,500- 4 వేలైంది. వినియోగదారుల పరిస్థితి టిడిపి హయాంలో పెనం మీద అంటకాగగా వైసిపి ప్రభుత్వంలో పొయ్యిలో పడి మాడినట్లయింది. పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌లు పెట్టగా ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున బినామీ బుకింగ్‌లు జరిగాయని, వేలాది టన్నులు మాయం అయ్యాయని స్వయాన సంబంధిత మంత్రే శెలవిచ్చారంటే విధానం ఎంత లోపభూయిష్టమో అర్థమవుతుంది.

ఇసుక సమస్యపై సమీక్షకు మంత్రుల కమిటీని వేయగా, ఇంతకు ముందు తెచ్చిన ఆన్‌లైన్‌ స్థానంలో ఆఫ్‌లైన్‌ను ప్రతిపాదించింది. ప్రజలు తమకు నచ్చిన చోట తమకు నచ్చిన ఇసుకను నేరుగా కొనుక్కొనే మరో సరికొత్త విధానాన్ని సిఫారసు చేయగా అది అమల్లోకొచ్చింది. ఈ పాలసీ పక్కాగా ప్రైవేటుకు పట్టం కడుతోంది. ఇసుక రీచ్‌ల గ్రామస్తులకు, బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణాలకు, ఎడ్లబండ్లపై తీసుకెళ్లే వారికి ఇసుక ఉచితమని చెబుతున్నారు. ఇది ఆచరణలో నిలిచేది కాదు. ఇలానే గతంలో టిడిపి 'ఉచిత ఇసుక' అని మోసం చేసింది. ప్రైవేటు కంపెనీలకు ఇసుకను అప్పగిస్తే లాభాలే పరమావధిగా బరితెగిస్తారు. గాలి జనార్ధన్‌రెడ్డి సహా బోలెడు మైనింగ్‌ కుంభకోణాలు మనకు అనుభవమే. ప్రకృతి వనరులను పరిమితంగా వాడుకోవాలి. లాభాల వేటలో భారీ యంత్రాలతో నదీ గర్భాలను తొలిస్తే పర్యావరణానికి హాని వాటిల్లుతుందని సర్వోన్నత న్యాయస్థానం, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వంటివి తరచూ హెచ్చరిస్తూనే ఉన్నాయి. ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నా, సహజ వనరులను రక్షించుకోవాలన్నా, ప్రజలకు తక్కువ ధరలో ఇసుక లభించాలన్నా ప్రభుత్వ ఏజెన్సీలే ఇసుకను నిర్వహించాలి. పేద, మధ్య తరగతి గృహ నిర్మాణాలకు ఉచిత ఇసుక అందించాలన్న లక్ష్యం అప్పుడే సాకారమవుతుంది. ఆర్థిక మాంద్యం, కరోనా, రాష్ట్రంలో అమరావతి సహా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడటం వలన భవన నిర్మాణం, దాని ఉప రంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. లక్షలాది కుటుంబాల జీవన్మరణ సమస్యగా పరిణమించిన ఇసుకపై ప్రభుత్వం సరైన విధానం పాటించడం తక్షణావసరం.