May 31,2023 20:57

ఇసుక అక్రమాలపై ఉక్కుపాదంపాదయాత్రలో నారా లోకేష్‌

దారిపొడవునా లోకేష్‌ దృష్టికి సమస్యల వెల్లువ
ప్రొద్దుటూరులో ఘన స్వాగతం ప్రజాశక్తి-జమ్మలమడుగురూరల్‌/ప్రొద్దుటురు పుట్టపర్తి సర్కిల్‌
తెలుగుదేశం ప్రభుతం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపుతామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. యువగళం పేరుతో లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర 112వ రోజుకు చేరుకుంది. బుధవారం వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని దేవగుడి విడిది కేంద్రం నుంచి సలివెందుల, దేవగుడి గ్రాస్‌ మీదుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని చౌడూ రులోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి శంకరాపురం, పెద్దశెట్టిపల్లె, నరసింహాపురం, చౌటపల్లి విడిది కేంద్రం వరకూ పాదయాత్ర సాగింది. ఆయా ప్రాంతాల్లో పద్మశాలి సామాజిక వర్గీయులు, స్థాని కులు, రైతులు, ఎంఆర్‌పిఎస్‌ నాయకులుతో ముఖా ముఖి, మాటామంతి, సమావేశాలు వంటి కార్యక్ర మాలు నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా పలుచోట్ల లోకేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మొత్తాన్ని జగన్‌ అండ్‌ కో పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ అడ్డగోలు దోపిడీకి తెరలేపారని తెలిపారు. నాలుగేళ్లలో ముఖ్యమంత్రి జగన్‌ ఇసుకపై రూ.10 వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకు పోయి 61 మంది అమాయకులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు, పరిసర గ్రామాల ప్రజల తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. ఇసుక పాలసీని సరళతరం చేసి స్థానికంగా ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతపై ఉన్న 5 శాతం జీఎస్టీ భారం పడకుండా చేస్తామని తెలిపారు. టిడ్కో ఇళ్లు, కామన్‌ వర్కింగ్‌ షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రన్న భీమా పథకాన్ని మళ్లీ ప్రవేశ పెడతామని పేర్కొన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత మగ్గాల సంఖ్య తగ్గిపోయిందన్నారు. ప్రభుత్వం నుండి సాయం లేక చేనేత కార్మికులు ఇతర రంగాలకు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల విద్యుత్‌ అందజేస్తామన్నారు. చేనేత క్లస్టర్స్‌ ఏర్పాటు చేసి ప్రత్యేక బ్రాండింగ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జగన్‌ నిర్వాకం కారణంగా గ్రామాల్లో కనీసం బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడానికి కూడా పంచాయతీల వద్ద నిధుల్లేని పరిస్థితి నెలకొందన్నారు. పలువురు సర్పంచ్‌లు పరువు కోసం సొంత డబ్బులు ఖర్చుపెట్టి పనులుచేసి, బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదైలైందన్నారు. అసమర్థ విధానాలతో రైతాంగం ఆత్మహత్యల్లో ఏపీని దేశంలోనే ముందు వరుసలో నిలిపారని తెలిపారు.. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, టిడిపి కడప పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జులు భూపేష్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో లోకేష్‌కు ఘన స్వాగతం
జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ప్రొద్దుటూరులోకి లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రవేశించించిన సందర్భంగా ఆయనకు జివి ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. లోకేష్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివస్తున్నారు.. లోకేష్‌తో సెల్ఫీలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీపడ్డారు. అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగారు. స్వాగతం పలికిన వారిలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, టిడిపి నాయకులు సురేష్‌ నాయుడు, ముక్తియర్‌, ఇవి సుధాకర్‌రెడ్డి తదితర నాయకులు ఉన్నారు.