ప్రజాశక్తి-పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని ఇస్లాపురం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరిం చాలని ఆ వార్డు కౌన్సిలర్ గీతా హనుమంతు ఆధ్వర్య ంలో స్థానిక మహిళలు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇస్లాపు రం గ్రామంలో నెలరోజుల నుంచి తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఈ విషయాన్ని స్థానిక నగర పంచాయతీ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. ఫలితంగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. చేసేది లేక సమీపంలోని పొలాల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని వాపోయారు. కావున ఇప్పటికైనా స్పందించి శాశ్వతంగా నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కె.కార్తీక్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు శ్రీరామ్‌యాదవ్, 3వ వార్డు కౌన్సిలర్ ఎస్‌ఎస్ గిరి, ఇస్లాపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నీటి సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తున్న మహిళలు










