ఆట పాటలతో మహిళలు
ఉత్సాహంగా..ఉల్లాసంగా క్రీడా పోటీలు
నెల్లూరు :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా స్పోర్ట్స్ అథారిటి, పలు ప్రభుత్వ రంగ సంస్థల సమన్వయంతో క్రీడల ద్వారా మహిళలు సాధికారత సాధించుటకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఏసి సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ప్రారంభమైయ్యాయి. బుధవారం నుంచి ఈ నెల 25వ తేది వరకు క్రీడా, యోగా తదితర విభాగాల్లో పోటీలు, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు ఈ పోటీలు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా ప్రాధికర సంస్థ , నగర కార్పోరేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏసి సుబ్బారెడ్డి స్టేడియం నుంచి కరెంట్ ఆఫీస్ సెంటర్‌లోని వైఎస్‌ఆర్ విగ్రహం మీదుగా తిరిగి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన కమిషనర్ హరిత జెండాఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో క్రీడాకారులు, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ,ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి విద్యార్ధులు, వాకర్స్, కార్పోరేషన్ అధికారులు, సిబ్బంది, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, సెట్నెల్ సిబ్బంది, స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఎన్‌జిఓలు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం స్టేడియం ఆవరణంలో హౌలీ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ మహిళలకు స్వేచ్చా, స్వాతంత్రం ఇచ్చి ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.పెంచలయ్య మాట్లాడుతూ మహిళలు క్రమం తప్పకుండా ఆటలు ఆడటం, వ్యాయామం చేయడం వల్ల మానసిక వత్తిడిని అధిగమించడం సాధ్యమౌతుందన్నారు. ఈ కార్యక్రమంలో సెట్నల్, డిఎస్‌ఎ ముఖ్యకార్యనిర్వాహణాధికారి డి.పుల్లయ్య, డిఎస్‌ఎ ఛీఫ్ కోచ్ ఆర్‌కె యతిరాజ్, అరుణకుమారి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లెక్చరర్స్ పాల్గొని ప్రసంగించారు.
నేడు రన్నింగ్, జావెలిన్‌త్రో విభాగాల్లో పోటీలు
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న క్రీడా పోటీలల్లో భాగంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి ఆటల పోటీలు ప్రారంభమౌతాయి. ముందుగా 100,200,400 మీటర్ల పరుగుపందెం, షాట్‌పుట్, జావెలిన్ త్రో విభాగాల్లో పోటీలుంటాయని నిర్వాహకులు తెలియజేశారు.










