Mar 17,2023 20:33

- అనంతపురం జిల్లా కలెక్టర్‌ నుంచి ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న రామచంద్రారెడ్డి


ఉత్కంఠ పోరులో స్వల్ప మెజార్టీతో గెలుపు
పట్టభద్ర ఓట్ల లెక్కింపుల్లో హోరాహోరీ ఆధిక్యం
ధ్రువీకరణ పత్రం అందజేసిన అనంత కలెక్టర్‌
ప్రజాశక్తి - కడప ప్రతినిధి : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎం.వి.రామచంద్రారెడ్డి గెలుపొందారు. రెండ్రోజులుగా అనంతపురం జెఎన్‌టియులో చేపట్టిన కౌంటింగ్‌లో తన సమీప ప్రత్యర్థి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి నుంచి ఎదురైన ఉత్కంఠ భరిత పోరులో 169 ఓట్ల స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 12 మంది అభ్యర్థులు నిలిచిన సంగతి తెలిసిందే. వీరిలో ఎం.వి.రామచంద్రారెడ్డి, ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, కత్తి నరసింహారెడ్డి మధ్య హొరాహోరీగా పోరు నడిచింది. వీరిలో ఎవరికీ 50 శాతం ఓట్లు లభించని నేపథ్యంలో ద్వితీయ ప్రాధాన్య ఓటును పరిగణలోకి తీసుకుని లెక్కించాల్సి వచ్చింది. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 25,272 ఓట్లు పోలు కాగా, 3,867 చెల్లని ఓట్లుగా తేలినట్లు సమాచారం. 21,405 ఓట్లలో అధికార వైసిపి మద్దతుదారు ఎం.వి.రామచంద్రారెడ్డికి 10,787 ఓట్లు, ఒంటేరు శ్రీనివాసులరెడ్డికి 10,618 ఓట్లు లభించాయి. 169 స్వల్పఓట్ల మెజార్టీతో అధికార వైసిసి మద్దతుదారు ఎం.వి.రామచంద్రారెడ్డి గెలు పొందినట్లు ప్రకటించారు. అనంతపురం కలెక్టర్‌ నాగలకీë ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం, కౌంటింగ్‌ దశల వరకు ప్రత్యర్థుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, పరిశీలన, ఉపసంహరణ దశల అనంతరం హోరాహోరీగా తలపడాల్సి వచ్చి మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, అనిల్‌రెడ్డి తదితరుల నుంచి అనివార్యమైన పోరు ఎదురైంది. కౌంటింగ్‌ దశలో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనూ ఆధిక్యం చేతులు మారుతూ రావడం ఊపిరి బిగబట్టుకుని గెలుపు కోసం నిరీక్షించాల్సి వచ్చింది. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ పది రౌండ్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకు లెక్కించిన ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపులోనూ అధికార వైసిపి మద్దతుదారు వెన్నపూస రవీంద్రారెడ్డి, టిడిపి మద్దతుదారు రామ్‌గోపాల్‌రెడ్డి మధ్య మెజార్టీ ఆధిక్యం చేతులు మారుతూ ఉండడం ఉత్కంఠను కలిగిస్తోంది. మిగిలిన మూడు రౌండ్ల ఎవరిని విజయలకీë వరించనున్నదోననే ఉత్కంఠ నెలకొంది.